క్యాన్సర్‌ చివరి స్టేజ్‌.. చావు తథ్యమని ఏడ్చిన నటుడు | Actor Narra Venkateswara Rao Daughter About His Father Final Days, Recalls His Emotional Battle With Cancer | Sakshi
Sakshi News home page

25 కిలోలు తగ్గి చివరి రోజుల్లో గుర్తుపట్టలేనంతగా.. తన సంపాదనంతా..

Mar 12 2026 10:02 PM | Updated on Mar 13 2026 1:20 PM

Actor Narra Venkateswara Rao Daughter about his father

చిన్నాపెద్ద తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గుర్తింపు సంపాదించుకున్నారు నర్రా వెంకటేశ్వరరావు. వెండితెరపైనే కాకుండా, రియల్‌ లైఫ్‌లోనూ ఠీవీగా ఉండే ఆయన జీవిత చరమాంకంలో మాత్రం  బిగుసుకుపోయాడు. చావును ముందే గ్రహించి చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. 2009 డిసెంబర్‌ 27న క్యాన్సర్‌తో కన్నుమూశాడు.

ఆలస్యంగా బయటపడ్డ క్యాన్సర్‌
తాజాగా నటుడి ఫ్యామిలీ ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ సందర్భంగా నర్రా కూతురు వాసంతి ఆయన గురించి ఎన్నో విషయాలు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. నాన్నకు క్యాన్సర్‌ చాలా ఆలస్యంగా బయటపడింది. ఆయన బరువు తగ్గిపోతుంటే షుగర్‌ వల్లేమో అనుకున్నాం.. ఎందుకైనా మంచిదని టెస్టులు చేయిస్తే పెద్ద పేగు క్యాన్సర్‌ ఉందని తేలింది. అది కూడా చివరి స్టేజ్‌.. 

25 కిలోలు తగ్గిన నటుడు
కొన్ని నెలలు మాత్రమే బతుకుతాడన్నారు. కీమోథెరపీ, సర్జరీలు చేయించడం వల్ల నాలుగేళ్లు బతికారు. క్యాన్సర్‌ వల్ల దాదాపు 25 కిలోలు తగ్గిపోయారు. కాకపోతే మొదటి సర్జరీ అయ్యాక పవిత్ర బంధం అని ఓ సీరియల్‌ చేశారు. ఇంట్లో ఉంటే ఏదో జబ్బుతో మంచానపడినట్లుందని పనితో బిజీ అయ్యారు. కానీ చివరి రోజుల్లో మాత్రం ఒంట్లో ఓపిక లేక షూటింగ్‌కు వెళ్లలేదు. 

చివరి రోజుల్లో కంటతడి
మనవళ్లతో ఎంజాయ్‌ చేయాలనుకున్న సమయంలో ఇలా ఆరోగ్యం దెబ్బతినేసరికి చాలా నిరాశపడ్డాడు. ఇంకేమైనా ట్రీట్‌మెంట్‌ ఉందా? కనుక్కున్నారా? అని అడిగేవారు. మరోపక్క రేపు ఏదైనా జరిగినా నిన్ను పిల్లలు చూసుకుంటారు అని అమ్మకు ధైర్యం చెప్పేవారు. ఇక ఆయన చావుకు దగ్గరైనప్పుడు ఎంతో ఏడ్చారు. నాన్న చాలా ధైర్యవంతుడు, అలాంటి ఆయన్ను అలా చూడటం అదే మొదటి, ఆఖరిసారి! 

సినిమా
హీరో శోభన్‌బాబు ఇచ్చిన సలహా వల్లే నాన్న సంపాదించిన ప్రతి పైసాలో సగం భూమి మీదే పెట్టేవాళ్లు. అలా ఎక్కువ ఆస్తులు సంపాదించాడు. కాగా నర్రా వెంకటేశ్వరరావు.. కర్తవ్యం, ఒసేయ్‌ రాములమ్మ, నేటి భారతం, తొలి ప్రేమ, పౌర్ణమి వంటి పలు చిత్రాలతో గుర్తింపు పొందాడు. ఎక్కువగా విలన్‌ తరహా పాత్రల్లో నటించాడు. దాదాపు మూడు దశాబ్దాల్లో 500కి పైగా సినిమాలు చేశాడు. 

చదవండి: నాన్న ప్రతి ఆదివారం  అవే ఆర్డర్‌ పెడతాడు: నాగచైతన్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement