అంటార్కిటికా ఖండం మొత్తం మంచుతోనే కప్పబడి ఉంటుంది. గడ్డకట్టే చలి, అడుగు తీసి అడుగు వేయలేనంత దట్టమైన మంచు పలకలు ఆవరించి ఉంటాయి. అయితే అటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఇటీవల 400 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఒక లగ్జరీ క్రూయిజ్ షిప్ ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయింది. అమెరికా కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగి వారిని రక్షించారు.
అసలేమి జరిగిందంటే?
ఆస్ట్రేలియాకు చెందిన 'సీనిక్ ఎక్లిప్స్ II' అనే విలాసవంతమైన నౌక గత వారం అంటార్కికా సమీపంలోని రాస్ సీ దట్టమైన మంచు గడ్డల మధ్య చిక్కుకుపోయింది. అంగుళం కూడా కదలలేని షిప్ ఉండిపోయింది. షిప్‌లో సుమారు 228 మంది ప్రయాణికులు, 176 మంది సిబ్బంది ఉన్నారు. వెంటనే సహాయం కోసం అమెరికా కోస్ట్ గార్డ్‌ను సంప్రదించారు.
దీంతో అదేసమయంలో అటుగా వెళ్తున్న యూఎస్ కోస్ట్ గార్డ్‌కు చెందిన భారీ ఐస్‌బ్రేకర్ నౌక 'పోలార్ స్టార్' రంగంలోకి దిగింది. పోలార్ స్టార్ క్రూయిజ్ షిప్ చుట్టూ ఉన్న గట్టి మంచు గడ్డలను ముక్కలు చేస్తూ ముందుకు వెళ్లింది. క్రూయిజ్ షిప్ కదలడానికి వీలుగా మంచులో ఒక కాలువ లాంటి మార్గాన్ని ఏర్పరిచింది.
పోలార్ స్టార్ ఏర్పరిచిన మార్గం ద్వారా 'సీనిక్ ఎక్లిప్స్ II' మంచు పలకల నుంచి బయటకు వచ్చింది. దీంతో షిప్‌లో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలార్ స్టార్ అనేది ఏకైక భారీ ఐస్‌బ్రేకర్ నౌక కావడం గమనార్హం. అంటార్కిటికాలోని శాస్త్రవేత్తలకు సరుకులు చేరవేయడానికి వెళ్తుండగా ఈ రక్షణ చర్యలో పోలార్ స్టార్ పాల్గొంది.


