ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది.. డెడ్‌లైన్లు, బాధ్యతలు, బిల్లులు, stress… ఈ గందరగోళం మధ్య “ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లిపోవాలి?” అనే భావన చాలామందిలో ఉంటుంది. ఇప్పుడు కనిపించబోయే ఈ సీన్… మీ మనసు లోతుల్లో ఉన్న భావనకి మౌనంగా సమాధానం.ఇంటర్నెట్‌లో ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అదే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే ఒక చిన్న పెంగ్విన్. దాన్ని నెటిజన్లు ప్రేమగా “ది నిహిలిస్ట్ పెంగ్విన్” అని పిలుస్తున్నారు, అంటే ఇక ఏదీ పట్టించుకోని పెంగ్విన్. ఎందుకంటే అది వెళ్లే దారిలో ఎవరూ లేరు, ఏ శబ్దం లేదు, ఏ గమ్యం కూడా లేదు.
ఈ వీడియో కొత్తది కాదు. ఇది 2007లో వచ్చిన ప్రఖ్యాత జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన Encounters at the End of the World అనే డాక్యుమెంటరీ నుంచి తీసుకున్న క్లిప్.డాక్యుమెంటరీ వీడియోలో డాక్టర్ డేవిడ్ ఎయిన్‌లే మాట్లాడుతూ.. ‘ఒక వేళ ఆ పెంగ్విన్ అక్కడి నుంచి తిరిగి కాలనీకి వచ్చేద్దామని అనుకున్నా కూడా సాధ్యపడదు. తిరిగి రావటం కూడా ‘డెత్ మార్చ్’ అవుతుంది. మార్గం మధ్యలోనే అది చనిపోయే అవకాశం ఉంది’ అని అన్నారు.
ఆ డాక్యుమెంటరీ వీడియో తీసిన ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్‌జోగ్ మాట్లాడుతూ...వీడియో తీసిన కొంత సేపటికే ఆ పెంగ్విన్ చనిపోయి ఉంటుంది. అది చనిపోవడానికి ముందు అంటార్కిటికా మంచు పర్వతాల్లో దాదాపు 70 కిలోమీటర్లు ఒంటరిగా నడిచింది’ అని చెప్పారు. అయితే, ఆ పెంగ్విన్ అలా అన్నిటినీ వదలి చావును వెతుక్కుంటూ వెళ్లిపోవటం వెనుక ఉన్న సరైన కారణం ఇంత వరకు తెలియరాలేదు. తన భాగస్వామి చనిపోవటం వల్ల ఆ పెంగ్విన్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని, ఆ బాధలో డెత్ మార్చ్ చేసి ప్రాణాలు తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పుడు ఈ క్లిప్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయింది. ముఖ్యంగా దీనికి ఒక పాటను జోడించిన తర్వాత ఇది మరింత ఎమోషనల్ గా మారింది. కానీ అసలు ప్రశ్న ఇదే… ఈ పెంగ్విన్ వీడియోకి ఇంత క్రేజ్ ఎందుకు? ఎందుకంటే ఇది మనల్నే చూపిస్తోంది. ఆఫీసు కుర్చీలో కూర్చొని, ల్యాప్‌టాప్ ముందు కళ్ళు ముడుచుకుని “ఇక చాల్రా… అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలి” అనిపించిన క్షణాల్ని ఇది గుర్తుచేస్తోంది. పెంగ్విన్ మాటలు మాట్లాడదు, కానీ దాని నడక చెబుతోంది – “నాకు శాంతి కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు కొంచెం ఒంటరితనం కావాలి.అని.
ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..ఇది ఒక పెంగ్విన్ కథ కాదు, ఇది మన ఆత్మ కథ. అని కామెంట్లు పెడుతున్నారు. పెంగ్విన్ వీడియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఆ పెంగ్విన్‌తో తాను కూడా నడుచుకుంటూ వెళుతున్నట్లు ఓ ఏఐ ఫొటో క్రియేట్ చేశారు.


