సంచలనం.. యుద్ధంలో తొలిసారి ‘డ్యాన్సింగ్‌ మిస్సైల్‌’ | Iran Launches Sejjil For 1st Time In Ongoing West Asia War | Sakshi
Sakshi News home page

సంచలనం.. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధంలో డ్యాన్సింగ్‌ మిస్సైళ్ల ప్రయోగం

Mar 16 2026 8:22 AM | Updated on Mar 16 2026 8:22 AM

Iran Launches Sejjil For 1st Time In Ongoing West Asia War

టెహ్రాన్‌: పశ్చిమాసియాలో నిప్పుల వర్షం కురుస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా మెరుపు దాడులు చేస్తున్నాయి. ఇరాన్‌లో తాము నిర్ధేశించుకున్న లక్ష్యాల్ని ఛేదిస్తున్నాయి. అయితే, ఈ క్రమంలో అమెరికా-ఇజ్రాయెల్‌ను బయపెట్టేలా యుద్ధంలో తొలిసారి ఇరాన్‌  అమ్మల పొదిలో అస్త్రాన్ని బయటకు తీసినట్లు ఇరాన్‌ మీడియా సంస్థ ప్రెస్‌టీవీ తెలిపింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యుద్ధం మొదలవగా.. ఆదివారం ఆ అస్త్రాన్ని బయటకు తీసింది. ప్రయోగించింది.  ప్రస్తుతం ఇరాన్‌ క్షిపణులపై ప్రపంచ దేశాల్లో చర్చ మొదలైంది. 

ఇజ్రాయెల్‌, అమెరికాకు షాకిస్తూ ఇరాన్‌ రెండు దశల బాలిస్టిక్‌ క్షిపణులను తయారు చేసి ఇటీవల పరీక్షించింది. వీటిలో ప్రధానమైనది సెజ్జిల్ బాలిస్టిక్ క్షిపణి. సెజ్జిల్‌ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, దాని విస్ఫోటన ప్రభావం భారీ స్థాయిలో ఉంటుంది. ఇరాన్‌ వద్ద సెజ్జిల్‌తో పాటు అషురా వంటి ఇతర క్షిపణులు కూడా ఉన్నాయి.

సెజ్జిల్-2 అనేది రెండు దశల, ఘన-ఇంధన మధ్యస్థ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. దీని పొడవు 18 మీటర్లు, వ్యాసం 1.25 మీటర్లు, మొత్తం బరువు 23,600 కిలోలు. ఇది 2,000 కి.మీ పరిధిలో దాదాపు 700 కిలోల పేలోడ్‌ను మోయగలదు. అధిక ఎత్తులో మలుపులు తిరే సామర్థ్యం కారణంగా దీనికి ‘డ్యాన్సింగ్ మిసైల్’ అనే పేరు వచ్చింది. ఈ ప్రత్యేకత వల్ల ఐరన్‌డోమ్ వంటి రక్షణ వ్యవస్థలను తప్పించగలదు.

సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) ప్రకారం, సజ్జిల్‌ క్షిపణి ఘన-ఇంధన రూపకల్పన వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది పాత షహాబ్ సిరీస్‌ ద్రవ-ఇంధన క్షిపణుల కంటే వేగంగా తయారు చేయబడుతుంది. తక్షణ ప్రయోగానికి సిద్ధంగా ఉంటుంది.

సెజ్జిల్‌ రూపకల్పనపై పని 1990ల ప్రారంభంలో ప్రారంభమైంది. 2008లో మొదటి పరీక్ష జరిగింది, ఆ సమయంలో క్షిపణి దాదాపు 800 కి.మీ ప్రయాణించింది. 2009లో రెండవ పరీక్షలో మార్గదర్శక వ్యవస్థలను అంచనా వేశారు. 2009 నుండి నాలుగు అదనపు పరీక్షలు జరిగాయి. ఆరవ పరీక్షలో క్షిపణి హిందూ మహాసముద్రంలోకి దాదాపు 1,900 కి.మీ ప్రయాణించినట్లు సమాచారం. ఇరాన్‌ ఈ క్షిపణిని యుద్ధంలో బయటకు తీయడం, అమెరికా–ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థలకు కొత్త సవాలుగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement