ఆదివారం ఇజ్రాయెల్ దాడిలో టెహ్రాన్‌లో నేలమట్టమైన పోలీస్ స్టేషన్, సమీప భవనాలు
15 మంది మృతి
ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్
అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు
మరో మూడు వారాలు యుద్ధం: ఇజ్రాయెల్
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియా రగులుతూనే ఉంది. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ యుద్ధం ఆదివారం 16వ రోజుకు చేరింది. ఇరాన్‌లోని పారిశ్రామిక నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. వాయవ్య ఇరాన్‌లో ఇజ్రాయెల్‌కు సహకరించేందుకు ప్రయతి్నస్తున్నారన్న ఆరోపణలతో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లో దాడులకు దిగింది. పశ్చిమాసియాలోని అమెరికా పరిశ్రమలను బయటకు తరలించాలని హెచ్చరించింది.
అమెరికా సంస్థల భాగస్వామ్యం ఉన్న కంపెనీలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. ఇరాన్‌లో సైనికేతర పరిశ్రమలపై జరిగిన దాడుల్లో సాధారణ పౌరులు మృతి చెందారు. ఇందుకు ప్రతీకారం తప్పదని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తామని వెల్లడించింది. ఇరాన్ సుప్రీం కమాండర్ మొజ్తబా ఖమేనీ క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు.
అమెరికా సైన్యం పశ్చిమాసియాలో క్రూయిజ్ మిస్సైళ్లు ప్రయోగిస్తోందని, వాటిని ధ్వంసం చేస్తామని అన్నారు. హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయలేదని ఐఆర్‌జీసీ నేవీ కమాండర్ అలీరెజా ప్రకటించారు. అందులో కొన్ని కీలక మార్గాలను మాత్రమే తమ నియంత్రణలోకి తీసుకున్నామని తెలిపారు. ఇరాన్‌పై యుద్ధాన్ని కనీసం మరో మూడు వారాల పాటు కొనసాగించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది.
అల్–డాఫ్రా ఎయిర్‌బేస్‌పై 10 క్షిపణులు
ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటిదాకా ఇజ్రాయెల్–అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌లో 10,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 1,400 మందికిపైగా మరణించారు. ఇజ్రాయెల్ దాడిలో తమ సీనియర్ మిలటరీ అధికారి బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా జలాలీ నసబ్ మృతి చెందినట్లు ఇరాన్ తెలిపింది. మరోవైపు గల్ఫ్‌లో ఇరాన్ దాడుల పరంపరం ఆగడం లేదు. రియాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంపై ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను తుత్తునియలు చేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ వెల్లడించింది. అల్–ఖర్గ్‌పై ప్రయోగించిన ఆరు బాలిస్టిక్ మిస్సైళ్లను, తూర్పు ప్రావిన్స్‌లో రెండు డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు ప్రకటించింది.
యూఏఈలోని అమెరికా అల్–డాఫ్రా ఎయిర్‌బేస్‌పై ఐఆర్‌జీసీ 10 క్షిపణులు ప్రయోగించింది. బహ్రెయిన్‌లో సైరన్ల మోత వినిపించింది. దాడులపై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు బహ్రెయిన్‌లో ఆరుగురు, యూఏఈలో 33 మంది అరెస్టయ్యారు. వారిలో పలువురు భారతీయులున్నారు. ఇరాన్ దాడుల్లో గాయపడిన 108 మందిని ఆసుపత్రికి తరలించినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇరాన్ సైన్యంతో పాటు లెబనాన్ భూభాగం నుంచి హెజ్»ొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించారు.
రాకెట్ల శిథిలాలు తాకడంతో టెల్ అవీవ్, హోలోన్ సిటీలో మంటలు చెలరేగాయి. కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది. సెంట్రల్ ఇజ్రాయెల్‌లో ఓ అపార్టుమెంట్ భవనం ధ్వంసమైంది. ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఇజ్రాయెల్ వద్ద బాలిస్టిక్ మిస్సైల్ ఇంటర్‌సెప్టర్ల కొరత నెలకొంది. యుద్ధం మరింత ముదిరితే ఇరాన్, హెజ్»ొల్లా దాడులను తిప్పికొట్టడం కష్టమన్న వాదన వినిపిస్తోంది.
ఇరాన్‌తో ఒప్పందానికి సిద్ధంగా లేం: ట్రంప్ స్పష్టీకరణ
యుద్ధాన్ని ముగించే విషయంలో తమతో ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ ఆసక్తి చూపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ, అందుకు తాము సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు. ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు సమంజసంగా లేవని అభిప్రాయపడ్డారు. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిలో నౌకల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ఇతర దేశాలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. హార్మూజ్ నుంచి వచ్చే చమురుపై ఆధారపడే దేశాలు యుద్ధనౌకలను పంపించాలని ట్రంప్ కోరారు. చమురు నౌకలకు ఇవి ఎస్కార్ట్‌గా పని చేస్తాయన్నారు.


