క్రికెట్ దిగ్గజం, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ఏమైంది? అనే అంశంపై మరోసారి తెర మీదకు వచ్చింది. అవినీతి కేసుల్లో ఆయన్ని రావల్పిండి(పంజాబ్) అడియాలా జైల్లో పెట్టి పాక్ ప్రభుత్వం.. జైల్లో ఆయన పట్ల దారుణంగా వ్యహరిస్తోందన్న విమర్శలు వెల్లవెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందంటూ తాజాగా కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. దీంతో ఖాన్ కుటుంబ సభ్యులు, పీటీఐ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబం, పీటీఐ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అడియాలా జైలులో ఖైదీగా ఉన్న ఖాన్‌కు కంటి సమస్య (Central Retinal Vein Occlusion) తలెత్తిందని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వ్యాధికి తక్షణ చికిత్స లేకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. దీంతో కుటుంబ సభ్యులు అప్రమత్తం అయ్యారు. ఈ విషయమై తక్షణమే కోర్టులను ఆశ్రయించాలని భావిస్తున్నారు.
అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో 2023 ఆగస్టులో ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి అడియాలా జైల్లోనే ఉన్నారు. అయితే.. ఆయన్ని ఒంటరిగా సెల్‌లో ఉంచారని.. తోటి ఖైదీలు, జైలు సిబ్బందిని ఆయనతో మాట్లాడనివ్వడం లేదని.. పైగా ఆయన ఉన్న గది, చుట్టుపక్కల పరిసరాలు కలుషితంగా ఉన్నాయని.. రోజులో కనీసం పట్టుమని పది అడుగులు కూడా వేయని స్థితిలో ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ పోస్ట్ చేశారాయన. అప్పటి నుంచి 100 రోజులకుపైగా ఆయన‍్ని ములాఖత్‌కు కూడా అనుమతించలేదు. దీంతో జైల్లో ఆయనకు ఏదైనా జరిగిందా? అనే చర్చా నడిచింది కూడా. చివరకు.. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో కుటుంబ సభ్యులను ఆయన్ని కలిసేందుకు అనుమతించారు.
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం కథనాలతో అడియాలా జైలు అధికారులు స్పందించారు. ఆయనకు జైల్లోనే చికిత్స అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఖాన్ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది వైద్యుల సూచనకు వ్యతిరేకంగా ఉందని అంటున్నారు. జైల్లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని.. అక్కడ ప్రాథమిక చికిత్స కూడా అందడం కష్టమని.. తక్షణమే ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సిందేని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమను ఆయన్ని కలిసేందుకు అనుమతించాలని కోరుతున్నారు. అయితే ఈ విజ్ఞప్తికి జైలు అధికారులు సానుకూలంగా స్పందించలేదని సమాచారం.
కోర్టు ఆదేశాలు బేతాఖరు
ఖాన్ చివరిసారిగా తన వ్యక్తిగత వైద్యుడిని 2024 అక్టోబరులో కలిశారు. అప్పటి నుంచి ఎలాంటి వైద్య పరీక్షలు జరగలేదని, ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడంలేదని పీటీఐ విమర్శిస్తోంది. అలాగే 2025 ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై కూడా చర్యలు తీసుకోలేదని పేర్కొంది.
ఇదిలా ఉంటే.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఖాన్ సోదరీమణులు అడియాలా జైలు బయట పీటీఐ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. ఖాన్ సోదరి నూరీన్ ఖానుమ్ మాట్లాడుతూ.. ఆయన అనారోగ్యం వార్తలు నిజమైతే మాకు ముందే సమాచారం ఇవ్వాలి కదా. మేమే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లేవాళ్లం కదా అని అన్నారు. మరో సోదరి అలీమా ఖానుమ్ మాట్లాడుతూ.. జైలు అధికారులు తమకుగానీ, లీగల్ టీంకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా వాళ్లిద్దరినీ అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈ పరిణామాలపై ప్రతిపక్ష కూటమి తహఫుజ్ ఆయిన్-ఇ-పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని షెహబాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
విచారణ ఎప్పుడంటే..
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. పీటీఐ నాయకులు ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతో ములాఖత్‌ను అనుమతించాలని కోరుతున్నారు. పార్టీ చైర్మన్ బరిస్టర్ గోహర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. ఖైదీని కలవడం ఒక చట్టబద్ధమైన హక్కు, ఖాన్‌తో పాటు ఆయన సతీమణి బుష్రా బీబీ ఆరోగ్యం కూడా బాగోలేదు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని పీటీఐ కోరగా.. రేపు లేదంటే ఎల్లుండి విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది.


