పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా యుద్ధాన్ని ఐదు రోజుల పాటు నిలిపివేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి.
పాకిస్తాన్ సమాచార మంత్రి అట్టౌల్లా తరార్ ప్రకటన ప్రకారం.. ఈ విరమణ మార్చి 19వ తేదీ అర్థరాత్రి నుండి మార్చి 24వ తేదీ అర్థరాత్రి వరకు కొనసాగుతుంది. ఈ మధ్యలో ఏదైనా సరిహద్దు దాడి, డ్రోన్ దాడి లేదా ఉగ్రవాద ఘటన జరిగితే ఆపరేషన్లు వెంటనే మరింత తీవ్రతతో పునఃప్రారంభమవుతాయి. ఈ నిర్ణయం సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ దేశాల విజ్ఞప్తి మేరకు తీసుకున్నది.
కాగా, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఒమర్ డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్‌పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారంతా వైద్య సాయం పొందుతున్న రోగులని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది.
అయితే పాక్ మాత్రం ఈ ఆరోపణను తీవ్రంగా ఖండిస్తూ.. తాము కేవలం ఉగ్రవాద మౌలిక వసతులు మరియు సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబాన్లు దురాండ్ లైన్ వెంబడి పాకిస్తాన్ సైన్యంపై ఆపరేషన్ ప్రారంభించారు.


