ఆగస్టు 20న భారత్, పాక్‌ పోరు | Hockey World Cup Tournament Schedule Released | Sakshi
Sakshi News home page

ఆగస్టు 20న భారత్, పాక్‌ పోరు

Mar 19 2026 1:06 AM | Updated on Mar 19 2026 1:06 AM

Hockey World Cup Tournament Schedule Released

ప్రపంచకప్‌ హాకీ టోర్నీ షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ: ఐదు దశాబ్దాల ప్రపంచకప్‌ ట్రోఫీ నిరీక్షణకు తెర దించాలంటే ఈసారి భారత పురుషుల హాకీ జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ప్రపంచకప్‌ టోర్నీలో వేల్స్‌ జట్టుతో జరిగే తొలి మ్యాచ్‌తో టీమిండియా టైటిల్‌ వేటను ఆరంభిస్తుంది. ఆగస్టు 16న నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్వీన్‌లో భారత్‌ తమ తొలి లీగ్‌ మ్యాచ్‌ ఆడుతుంది. 

పూల్‌ ‘డి’లో ఉన్న భారత బృందం ఆ తర్వాత ఆగస్టు 18న ఇంగ్లండ్‌తో... ఆగస్టు 20న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ‘ఢీ’కొంటుంది. తదుపరి దశకు అర్హత సాధించాలంటే భారత్‌ పూల్‌ ‘డి’లోని తొలి రెండు స్థానాల్లో కచి్చతంగా ఉండాలి. మరోవైపు భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 16న చైనాతో తలపడుతుంది. 

పూల్‌ ‘డి’లో ఉన్న భారత జట్టు రెండో మ్యాచ్‌లో ఆగస్టు 18న దక్షిణాఫ్రికాతో... చివరిదైన మూడో మ్యాచ్‌లో ఆగస్టు 20న ఇంగ్లండ్‌తో ఆడుతుంది. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక నాలుగు పూల్స్‌ నుంచి రెండు జట్ల చొప్పున ఎనిమిది జట్లు రెండో రౌండ్‌కు చేరుకుంటాయి. రెండో రౌండ్‌లో ఎనిమిది జట్లను రెండు పూల్స్‌గా (ఒక్కో పూల్‌లో నాలుగు జట్లు) విభజిస్తారు. 

రెండో రౌండ్‌ ముగిశాక రెండు పూల్స్‌ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత పురుషుల జట్టు 1975లో ఏకైకసారి ప్రపంచకప్‌ టైటిల్‌ నెగ్గగా... భారత మహిళల జట్టు 1974లో అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement