breaking news
Adiala jail
-
అఫ్గాన్‌తో ఉద్దేశపూర్వకంగా మునీర్ వైరం
లాహోర్: పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిమ్ మునీర్ అనుసరిస్తున్న విధానాలు దేశానికి వినాశకరమైనవని మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ బుధవారం ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలను పెంచుతున్నారని ప్రస్తుతం పాకిస్తాన్ జైలులో ఉన్న ఇమ్రాన్ ధ్వజమెత్తారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో, దాదాపు నెల రోజుల విరామం తర్వాత రావల్పిండిలోని అడియాలా జైలులో తన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్‌ను కలిసిన మర్నాడు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆసిమ్ మునీర్ విధానాలు పాకిస్తాన్‌కు విపత్కరమైనవి. ఆయన విధానాలతో, ఉగ్రవాదం అదుపు తప్పి పెరిగిపోతోంది. ఇది నన్ను తీవ్రంగా బాధించింది’.. అని ఖాన్ ఉర్దూలో ట్విట్టర్లో పోస్టు చేశారు.పశ్చిమ దేశాలను సంతృప్తిపరచడానికే..‘ఆసిమ్ మునీర్‌కు పాకిస్తాన్ జాతీయ ప్రయోజనాల గురించి ఏమాత్రం పట్టదు. పశ్చిమ దేశాలను సంతోషపెట్టడానికి మాత్రమే ఆయన ఇదంతా చేస్తున్నారు. అంతర్జాతీయంగా తానొక ’ముజాహిద్’ (ఇస్లామిక్ ఫైటర్) గా కనిపించడానికి, ఉద్దేశపూర్వకంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఉద్రిక్తతలను రాజేశారు’.. అని ఖాన్ ఆరోపించారు. డ్రోన్ దాడులను, సొంత ప్రజలపై సైనిక చర్యలను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. అవి ఉగ్రవాదాన్ని మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు. ‘మునీర్ మొదట ఆఫ్ఘన్లను బెదిరించారు, తరువాత శరణార్థులను పాకిస్తాన్ నుండి బహిష్కరించారు. డ్రోన్ దాడులు చేశారు. వాటి పర్యవసానాలను ఇప్పుడు మనం పెరుగుతున్న ఉగ్రవాదం రూపంలో ఎదుర్కొంటున్నాం’.. అని ఖాన్ పేర్కొన్నారు. జనరల్ మునీర్‌ను.. మానసిక స్థిరత్వం లేని వ్యక్తిగా అభివర్ణించారు. మునీర్ ఆదేశాలతోనే నిర్బంధంమునీర్ ఆదేశాల మేరకే, తనను, తన భార్యను తప్పుడు కేసులతో బంధించి, అత్యంత దారుణమైన మానసిక చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఖాన్ వాపోయారు. ‘నన్ను నాలుగు వారాలుగా ఒంటరి నిర్బంధంలో ఉంచారు. సెల్లో ఉంచి తాళం వేశారు. బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు లేవు. జైలు మాన్యువల్ హామీ ఇచ్చిన కనీస సౌకర్యాలను కూడా మాకు దూరం చేశారు’.. ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, తన రాజకీయ సహచరులతో సమావేశాలను నిషేధించారని, ఇప్పుడు న్యాయవాదులు, కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని కూడా అడ్డుకున్నారని చెప్పారు. ‘నన్ను కలవాలనే చట్టబద్ధమైన హక్కును కోరినందుకు నా సోదరి నౌరీన్ నియాజీని రోడ్డుపై లాక్కెళ్లారు’.. అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌తో భేటీ అనంతరం ఉజ్మా మాట్లాడుతూ, ఆయన ఆరోగ్యం బాగుంది.. కానీ ఒంటరి నిర్బంధంతో మానసిక చిత్రహింసకు గురవుతున్నారని తెలిపారు. -
ఖాన్ సాబ్ సేఫేనా.. మరికొద్ది గంటల్లో సస్పెన్స్‌కు తెర
పాకిస్తాన్ మాజీ ప్రధాని, దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగానే ఉన్నారా?.. పాక్ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుందా?. జైల్లో ఉన్న ఖాన్‌ను ఆయన్ని కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. దీంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అడియాలా జైలు అధికారులు అనుమతించారు. దీంతో ఆయన సోదరి ఉజ్మాతో పాటు లాయర్ కూడా ఖాన్‌ను కలిసే అవకాశం ఉంది. అయితే ఈ ములాఖాత్ ముగిశాక సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయొద్దని ఆమెకు పాక్ ప్రభుత్వం షరతు విధించినట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కినా.. రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంతో రావల్పిండిలో 144 సెక్షన్ విధించారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనలపై నిషేధం విధించారు. అయినా కూడా భారీ ర్యాలీ చేపట్టాలని పీటీఐ వర్గాలు భావిస్తున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం చేరింది. ఈ నేపథ్యంలో నిర్బంధాలు.. హౌజ్ అరెస్టులతో రావల్పిండిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారని.. ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. ఇలా రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అయితే జైలు అధికారులు, ప్రభుత్వం వాటిని తోసిపుచ్చింది. మరోవైపు ఆయన సురక్షితంగానే ఉన్నారా? అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తనయుడు ఒకవేళ తన తండ్రి బతికే ఉన్నా.. హింసించి చంపే అవకాశం ఉందంటూ సంచలన ఆరోపణలకు దిగారు.గత నెల మొదట్లో ఆయన నుంచి ట్వీట్ తర్వాత ఎలాంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ సురక్షితంగా ఉన్నారా? అనేది బయటి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ పెరిగిపోయింది. తెహ్రీక్ ఈ ఇన్షాఫ్ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలు, ఇటు ప్రజలు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని నిర్ణయించారు. ఇమ్రాన్ ఖాన్ భద్రతపై.. ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు మరికొన్ని గంట్లలో అనే ఉత్కంఠకు తెర పడే అవకాశం కనిపిస్తోంది. -
సంపూర్ణ ఆరోగ్యంతో ఇమ్రాన్
లాహోర్: మాజీ క్రికెటర్, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(73) కస్టడీలో చనిపోయారంటూ వస్తున్న వార్తలు, అడియాలా జైలు వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. జైలులోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని గురువారం ప్రకటించింది. ఇమ్రాన్‌ను ఎక్కడికీ తరలించలేదని, జైలులోనే పూర్తి స్థాయిలో అవసరమైన వైద్య సాయం అందుతోందని పేర్కొంది. ‘తీవ్ర అనారో గ్యంతో ఉన్న ఇమ్రాన్‌ను అడియాలా జైలు నుంచి ఆస్పత్రికి తరలించామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు’అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత కూడా అయిన ఇమ్రాన్ ఖాన్ వివిధ అవినీతి ఆరోపణలు, ఉగ్రవాదం కేసుల్లో 2023 ఆగస్ట్ నుంచి, జైలు జీవితం గడుపుతుండటం తెల్సిందే. -
‘అడియాలా’కి బదులు ‘అటోక్’కి ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో మూడేళ్లు జైలు పడిన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రభుత్వం అటోక్ జైలుకు తరలించింది. కానీ ఇమ్రాన్‌ను రావలి్పండిలోని అడియాలా జైల్లో ఉంచాలని ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఇమ్రాన్‌కు అడియాలా జైల్లో భద్రత కల్పించాలని పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా అటోక్ జైలుకి తరలించినట్టుగా ఒక నివేదిక వెల్లడించింది. అటోక్ జైలుకి తరలించడం కోసమే లాహోర్ పోలీసులు ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసినట్టు ఆ నివేదిక పేర్కొంది. ఇమ్రాన్‌ను కలవడానికి అనుమతించడం లేదు: పీటీఐ ఆందోళన జైల్లో ఉన్న ఇమ్రాన్‌ను కలవడానికి పార్టీ న్యాయవాదులకి అనుమతించడం లేదని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ ఆరోపించింది. కోర్టు కు సమర్పించాల్సిన డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకోవడానికి అనుమతి కోరినా అధికారులు నిరాకరించినట్టు ఒక ప్రకటనలో పే ర్కొంది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయలేదని కిడ్నా ప్ చేసి తీసుకువెళ్లారని విరుచుకుపడింది. -
మరో నలుగురిని ఉరి తీసిన పాక్
ఇస్లామాబాద్: 12 మందికి ఉరి వేసి... 24 గంటలు గడిచిందో లేదో మరో నలుగురికి పాక్ ప్రభుత్వం గురువారం ఉరిశిక్ష అమలు చేసింది. రావల్పిండి నగరంలో సోదరులు మహమ్మద్ అస్గర్, గులాం మహ్మమద్లతోపాటు గులిస్తాన్ జమన్లను ఈ రోజు అడియాల జైల్లో ఉన్నతాధికారుల సమక్షంలో ఉరి తీశారు. సోదరులు అస్గర్, గులాంలు ఇద్దరు బంధువులను హత్య చేశారు. జమాన్ 1997లో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. అలాగే అబ్దుల్ సత్తార్ మెయిన్వాలి జైలులో ఉరి తీశారు. 1992లో సత్తార్ వ్యక్తిగత కక్ష్యతో హత్య చేశాడు. 2014 డిసెంబర్ 16న పెషావర్‌లో తీవ్రవాదులు ఆర్మీ స్కూల్‌పై దాడి చేసి 150 మందిని అంతమొందించారు. ఈ నేపథ్యంలో ఉరిశిక్షపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో నాటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 54 మంది నిందితులకు పాక్ ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసింది.


