ఖాన్‌ సాబ్‌ సేఫేనా.. మరికొద్ది గంటల్లో సస్పెన్స్‌కు తెర | Imran Khan Sister Meet EX PM In Jail Updates | Sakshi
Sakshi News home page

ఖాన్‌ సాబ్‌ సేఫేనా.. మరికొద్ది గంటల్లో సస్పెన్స్‌కు తెర

Dec 2 2025 9:14 AM | Updated on Dec 2 2025 11:05 AM

Imran Khan Sister Meet EX PM In Jail Updates

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని, దిగ్గజ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ సురక్షితంగానే ఉన్నారా?.. పాక్‌ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుందా?. జైల్లో ఉన్న ఖాన్‌ను ఆయన్ని కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. దీంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. 

ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అడియాలా జైలు అధికారులు అనుమతించారు. దీంతో ఆయన సోదరి ఉజ్మాతో పాటు లాయర్‌ కూడా ఖాన్‌ను కలిసే అవకాశం ఉంది. అయితే ఈ ములాఖాత్‌ ముగిశాక సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్ట్‌ చేయొద్దని ఆమెకు పాక్‌ ప్రభుత్వం షరతు విధించినట్లు తెలుస్తోంది. ఇమ్రాన్‌ ఖాన్‌ శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కినా.. రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంతో రావల్పిండిలో 144 సెక్షన్‌ విధించారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనలపై నిషేధం విధించారు. అయినా కూడా భారీ ర్యాలీ చేపట్టాలని పీటీఐ వర్గాలు భావిస్తున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం చేరింది. ఈ నేపథ్యంలో నిర్బంధాలు.. హౌజ్‌ అరెస్టులతో రావల్పిండిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

ఇమ్రాన్‌ ఖాన్‌ జైల్లో మరణించారని.. ఆయన ఆరోగ్యం క్షీణించిందని.. ఇలా రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అయితే జైలు అధికారులు, ప్రభుత్వం వాటిని తోసిపుచ్చింది. మరోవైపు ఆయన సురక్షితంగానే ఉన్నారా? అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తనయుడు ఒకవేళ తన తండ్రి బతికే ఉన్నా.. హింసించి చంపే అవకాశం ఉందంటూ సంచలన ఆరోపణలకు దిగారు.

గత నెల మొదట్లో ఆయన నుంచి ట్వీట్‌ తర్వాత ఎలాంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ సురక్షితంగా ఉన్నారా? అనేది బయటి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందన్న డిమాండ్‌ పెరిగిపోయింది. తెహ్రీక్‌ ఈ ఇన్షాఫ్‌ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలు, ఇటు ప్రజలు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని నిర్ణయించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ భద్రతపై.. ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు మరికొన్ని గంట్లలో అనే ఉత్కంఠకు తెర పడే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement