నేడు న్యూజిలాండ్‌తో నాలుగో టి20
4–0పై టీమిండియా గురి
తీవ్ర ఒత్తిడిలో కివీస్
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత భారత్ ఆ కసినంతా టి20ల్లో చూపిస్తోంది. ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయి ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకుంది. అయినా సరే ఉదాసీనతకు తావు ఇవ్వకుండా అదే జోరు కొనసాగించాలని జట్టు భావిస్తోంది. వరల్డ్ కప్‌కు ముందు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తమ బలాన్ని మరోసారి ప్రదర్శించుకునేందుకు జట్టు సిద్ధమైంది. మరోవైపు సిరీస్‌లో ఒక్క విజయంతోనైనా ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తున్న కివీస్ ఏమాత్రం పోరాడుతుందో చూడాలి.
సాక్షి, విశాఖపట్నం: భారత్, న్యూజిలాండ్ టి20 సిరీస్‌లో మరో పోరుకు రంగం సిద్ధమైంది. వైజాగ్‌లోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో నేడు ఇరు జట్ల మధ్య నాలుగో టి20 మ్యాచ్ జరుగుతుంది. సిరీస్ భారత్ సొంతమైన నేపథ్యంలో ఫలితం పరంగా ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేదు. అయితే మరోసారి చెలరేగి ఆధిక్యాన్ని 4–0కు పెంచుకోవాలని సూర్య బృందం పట్టుదలగా ఉంది. వన్డేల్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన కివీస్ టి20ల్లో పూర్తిగా చేతులెత్తేసింది. వరల్డ్ కప్‌కు ముందు ఇది ఆందోళన కలిగిస్తుండటంతో తమ లోపాలు సరిదిద్దుకోవడంపై జట్టు దృష్టి పెట్టింది.
సామ్సన్‌కు చివరి చాన్స్!
తొలి మూడు టి20ల్లో భారత జట్టు ప్రదర్శన చూస్తే జట్టులో లోపాలేమీ కనిపించడం లేదు. వరల్డ్ కప్‌కు ముందు టీమ్ కూర్పుపై కూడా చాలా స్పష్టత వచ్చింది. అయితే ఓపెనర్ సంజు సామ్సన్ ఫామ్ మాత్రమే ఆందోళన కలిగిస్తోంది. గిల్‌పై వేటు వేయడంతో ఓపెనర్‌గా వరల్డ్ కప్ టీమ్‌లో కూడా చోటు దక్కించుకున్న సామ్సన్ తగిన న్యాయం చేయలేకపోతున్నాడు.

మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 10, 6, 0 పరుగుల తర్వాత అతనిపై తీవ్ర ఒత్తిడి ఉంది. తిలక్ వర్మ గాయంతో మూడో స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్ రెండు మ్యాచ్‌లలో చెలరేగిపోయాడు. తిలక్ తిరిగి వస్తే ఇషాన్ ఓపెనర్‌గా వెళితే సామ్సన్‌పై వేటు వేయడం ఖాయం. అదృష్టవశాత్తూ తిలక్ కోలుకోకపోవడంతో సామ్సన్‌కు మరో రెండు అవకాశాలు దక్కుతున్నాయి కాబట్టి అతను దీనిని వాడుకొని భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది.
మరోవైపు అభిషేక్ శర్మ అసాధారణ బ్యాటింగ్‌ను నిలువరించడం కివీస్ వల్ల కావడం లేదు. భారత అభిమానుల కోణంలో చూస్తే అభిషేక్ ఇంకా ఎంతగా విధ్వంసం సృష్టిస్తాడనేదే ప్రస్తుతం చర్చనీయాంశం. గత మ్యాచ్‌లో అతనితో పాటు సూర్య కూడా చెలరేగిపోవడంతో అతి సులువుగా భారత్ గెలిచింది.
పాండ్యా, దూబే, రింకూ తమ స్థాయిలో సత్తా చాటుతుండటంతో భారత్ తిరుగులేని జట్టుగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో రొటేషన్‌లో ఆటగాళ్లను ప్రయతి్నంచే క్రమంలో మరోసారి బుమ్రాకు విశ్రాంతిచ్చే అవకాశం ఉంది. బుమ్రా, బిష్ణోయ్ స్థానాల్లో అర్‡్షదీప్, వరుణ్ చక్రవర్తి రావడం ఖాయం.
రెండు మార్పులతో...
న్యూజిలాండ్ పరిస్థితి చూస్తే ఏ ఆటగాడు కూడా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించేలా కనిపించడం లేదు. ఒక్కో మ్యాచ్‌కు జట్టు ప్రదర్శన మరింత పేలవంగా మారుతూ వచ్చింది. తొలి పోరులో 190 పరుగులు చేసి కాస్త పోటీనిచ్చినట్లు కనిపించినా...ఆ తర్వాత భారత్ 209 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో... 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించడం కివీస్ పరిస్థితిని చూపిస్తోంది.
ఈ మ్యాచ్ కోసం టీమ్‌లో రెండు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. రాబిన్సన్, క్లార్క్ స్థానాల్లో పేసర్ ఫెర్గూసన్, ఆల్‌రౌండర్ నీషమ్ తుది జట్టులోకి వస్తారు. గాయం నుంచి కోలుకున్న తమ ప్రధాన పేసర్ ఫెర్గూసన్ ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించగలడని కివీస్ ఆశిస్తోంది. మూడు మ్యాచ్‌లలో కలిపి జట్టు నుంచి ఒకే ఒక అర్ధసెంచరీ నమోదైంది.
ఫిలిప్స్ మాత్రమే ఫర్వాలేదనిపించగా, వన్డేల్లో చెలరేగిన మిచెల్ ఇక్కడ ప్రభావం చూపలేకపోతున్నాడు. కెపె్టన్ సాంట్నర్ కూడా విఫలమయ్యాడు. శుభారంభాలు లేకపోవడం జట్టును దెబ్బ తీస్తోంది. టీమ్ బౌలింగ్ చెత్తగా కనిపిస్తోంది. టీమ్‌లో ఒక బౌలర్ నమోదు చేసిన అతి తక్కువ ఎకానమీ 10 ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి స్థితి నుంచి కివీస్ ఎలా కోలుకుంటుందనేది కీలకం.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, పాండ్యా, దూబే, రింకూ, హర్షిత్, కుల్దీప్, అర్ష్ దీప్, వరుణ్.
న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్ ), సీఫెర్ట్, కాన్వే, రచిన్, ఫిలిప్స్, మిచెల్, చాప్‌మన్, నీషమ్, హెన్రీ, ఫెర్గూసన్, సోధి.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌తో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. మంచు ప్రభావం కూడా కాస్త ఉండవచ్చు. ఈ మైదానంలో 4 టి20లు ఆడిన భారత్ 3 గెలిచి ఒకటి ఓడింది. 2023 నవంబర్‌లో ఆఖరి మ్యాచ్ జరగ్గా... ఆసీస్‌పై 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.5 ఓవర్లలో ఛేదించింది.


