హెచ్‌–1బీలకు ఉద్యోగాలివ్వకండి | Texas Freezes Fresh H-1B Visas At State Colleges And Agencies, Visa Delays Extend To 2027 | Sakshi
Sakshi News home page

హెచ్‌–1బీలకు ఉద్యోగాలివ్వకండి

Jan 28 2026 7:32 AM | Updated on Jan 29 2026 6:35 AM

Texas freezes fresh H-1B visas at state colleges And agencies

రాష్ట్ర వర్సిటీలు, ఏజెన్సీలకు టెక్సాస్‌ గవర్నర్‌ ఆదేశం

టెక్సాస్‌లో పెరిగిన హెచ్‌–1బీ వీసాదారుల కష్టాలు

హూస్టన్‌: ప్రభుత్వ నిధులతో పనిచేసే తమ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, విభాగాల్లో హెచ్‌–1బీ వీసాదారుల నియమాకాలను తక్షణం నిలిపేయాలని టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబ్బాట్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో హెచ్‌–1బీ ఉద్యోగ వీసాదారుల కష్టాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ‘‘టెక్సాస్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ టెక్సాస్‌ కార్మికులు, టెక్సాస్‌లోని సంస్థల యాజమాన్యాల ప్రయోజనాల కోసం మాత్రమే పాటుపడాలి. 

ఇలాంటి టెక్సాస్‌లో హెచ్‌–1బీ వీసా పథకంలో పలు అవకతవకలు జరిగాయని తెలుస్తోంది. హెచ్‌–1బీ వీసాలను పలువురు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో ఉద్యోగాలు అమెరికా కార్మికులకే దక్కాలి. అలాగే టెక్సాస్‌లో ఉద్యోగ అవకాశాలు టెక్సాస్‌ ప్రజలకే దక్కాలి. అందులో భాగంగానే మన రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారుల నిధులతో పనిచేసే అన్ని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న హెచ్‌–1బీ వీసాదారుల పిటిషన్ల పరిశీలనను తక్షణం నిలిపేయండి’’ అని వర్సిటీలు, ఏజెన్సీలకు రాసిన లేఖలో గ్రెగ్‌ పేర్కొ న్నారు.

 ‘‘నియామకాల నిబంధనలను కఠినతరం చేశాం. హెచ్‌–1బీ వీసాదారులను నియమించుకునే ప్రక్రియను 2027 మే 31వ తేదీదాకా నిలిపివేస్తున్నాం. కొన్ని ఉద్యోగాల్లో హెచ్‌–1బీ వీసాదారులను నియమించుకోవడం తప్ప మరో మార్గంలేదని టెక్సాస్‌ వర్క్‌ ఫోర్స్‌ కమిషన్‌ నుంచి సిఫార్సు లేఖలు తీసుకొచ్చిన సందర్భాల్లో మాత్రమే పాక్షికంగా మినహాయింపు వర్తిస్తుంది’’ అని ఆయన స్పష్టంచేశారు. ‘‘ మీ పరిధిలో ఎంత మంది హెచ్‌–1బీ వీసాదారులకు ఉద్యోగాలిచ్చారు? ఎలాంటి ఉద్యోగాలిచ్చారు? వాళ్లది ఏ దేశం? వాళ్ల వీసా గడువు తేదీలను పేర్కొంటూ వివరాలు సమర్పించండి’’ అని గ్రెగ్‌ ఆదేశించారు. 

టెక్సాస్‌ ప్రభుత్వ వర్సిటీల్లో వందలాది మంది విదేశీ బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో ఇంజనీరింగ్, ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక రంగాల నుంచి భారతీయులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. హెచ్‌–1బీ వీసాదారుల ఉద్యోగ నియమకాలు ఆగిపోతే వర్సిటీల్లో పరిశోధన, ఆవిష్కరణ రంగాలు కుదేలయ్యే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రెగ్‌ నిర్ణయంతో స్థానికులకు ఉద్యోగాలు దక్కుతాయని కొందరు భావిస్తుంటే ఉన్నత విద్య, పరిశోధనలో అంతర్జాతీయంగా టెక్సాస్‌ పోటీతత్వం తగ్గిపోతుందని విమర్శకులు వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement