శుక్రవారం లెబనాన్‌లోని అబ్బాసియేలో ఇజ్రాయెల్ దాడులతో ఎగసిపడుతున్న మంటలు
పేలుళ్లతో దద్దరిల్లిపోయిన టెహ్రాన్
ఇజ్రాయెల్–అమెరికా క్షిపణుల వర్షం
భారీ స్థాయిలో ఇరాన్ ప్రతీకార దాడులు
ఒమన్‌లో ఇద్దరు భారతీయుల మృతి
11 మంది క్షతగాత్రుల్లో 10 మంది మనోళ్లే
దుబాయ్ ఎయిర్‌పోర్టుపై దాడి, నలుగురికి గాయాలు
యూఎస్ యుద్ధ నౌక అబ్రహం లింకన్‌పై దాడులు
భారీగా దెబ్బ తిందన్న ఇరాన్, ఖండించిన అమెరికా
దుబాయ్/వాషింగ్టన్/జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ శుక్రవారం భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. శుక్రవారం నగరం నడిరోడ్డున అత్యంత శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత ఫిరదౌసీ స్క్వేర్ వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఖుద్స్ డే ప్రదర్శనల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని ఉండగా ఈ ఉదంతం జరిగినట్టు ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. పేలుడు కారణమేమిటో తెలియకపోయినా ఆ ప్రాంతంపై దాడి చేస్తామని శుక్రవారం ఉదయమే ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అంతేగాక ఫిరదౌసీ స్క్వేర్ వద్ద ర్యాలీలు మొదలయ్యేందుకు కాసేపటి ముందే టెహ్రాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా భారీ స్థాయి వైమానిక దాడులకు దిగాయి. దాంతో రాజధాని మీదుగా ఎటు చూసినా దట్టమైన పొగ అలముకుని కన్పించింది.
అయితే దాడులకు ఇరానీలు వెరవలేదు. పేలుళ్ల అనంతరం కూడా వేలాదిగా టెహ్రాన్ వీధుల్లో ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ‘అమెరికాకు, ఇజ్రాయెల్‌కు మరణం’ అంటూ పెద్దపెట్టున నినదించారు. ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ గులాం హుసేన్ మొహసెనీ ఎజెయ్, రక్షణ శాఖ ఉన్నతాధికారి అలీ లరిజానీ తదితరులు కూడా అందులో భాగస్వాములయ్యారు. పేలుళ్లలో చాలామందే మరణించినట్టు భావిస్తున్నారు. ఇరాన్ మాత్రం ప్రాణనష్టంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. పాలస్తీనావాసులకు మద్దతుగా ఇరాన్ ఏటా ఖుద్స్ డే జరుపుతూ వస్తోంది. ఇరాన్‌వ్యాప్తంగా క్షిపణి, ఇజ్రాయెల్–అమెరికా బాంబు దాడులు శుక్రవారమూ కొనసాగాయి. ప్రధానంగా సైనిక, క్షిపణి కమాండ్ వ్యవస్థలనే లక్ష్యం చేసుకున్నారు.
ఇరాన్ కూడా భారీ స్థాయిలో ప్రతి దాడులకు దిగింది. మద్యధరా ప్రాంతంలో మోహరించిన అమెరికాకు చెందిన భారీ విమానవాహక యుద్ధ నౌక అబ్రహం లింకన్‌పై ఏకంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్టు రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. ‘‘అత్యంత కచ్చితత్వంతో కూడిన మా దాడుల్లో నౌకకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అది పని చేయడం లేదు. యుద్ధరంగం నుంచి వెనుదిరిగి వెళ్లిపోతోంది’’ అని పేర్కొంది. అమెరికా మాత్రం ఈ వార్తలను ఖండించింది. ఒక ఇరాన్ పడవ కేవలం తమ నౌకకు అతి సమీపానికి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
అమెరికాకు చెందిన మరో విమానవాహక యుద్ధ నౌక గెరాల్డ్ ఫోర్డ్‌లోనూ మంటలు చెలరేగడం కలకలం రేపింది. దీనికి యుద్ధంతో సంబంధం లేదని అమెరికా తెలిపింది. ‘‘లాండ్రీ ప్రదేశంలో చెలరేగిన మంటల్లో ఇద్దరు నావికులకు గాయాలయ్యాయి. నౌకకు నష్టమేమీ వాటిల్లలేదు. ఎప్పట్లాగే చురుగ్గా యుద్ధంలో పాల్గొంటోంది’’ అని వెల్లడించింది. మరోవైపు లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడులు నిర్నిరోధంగా కొనసాగాయి. దాంతో 60 మందికి పైగా గాయపడ్డారు.
గల్ఫ్‌పై దాడులే దాడులు
అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ దేశాలపైనా ఇరాన్ తీవ్రస్థాయిలో దాడులు కొనసాగించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం మరోసారి డ్రోన్ దాడులు జరిపింది. దాంతో అక్కడ మంటలు చెలరేగాయి. నలుగురు గాయపడ్డట్టు సమాచారం. దుబాయ్ పారిశ్రామిక ప్రాంతంపైనా దాడులు జరిగాయి. దాంతో దుబాయ్ ఇంటర్నేషనల్ పైనాన్షియల్ సెంటర్‌లో ఒక భవనం భారీగా దెబ్బ తిన్నది. అబుదాబి విమానాశ్రయ సమీపంలో కూడా డ్రోన్ దాడులతో మంటలు చెలరేగాయి. తమపైకి దూసుకొచి్చన 7 ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లను, 27 డ్రోన్లను అడ్డుకున్నట్టు యూఏఈ ప్రకటించింది.
ఒమన్‌లోని సొహర్ నగరంపై రెండు డ్రోన్ దాడులు జరిగాయి. వాటిలో ఒకటి అల్ అవీ పారిశ్రామిక ప్రాంతాన్ని తాకడంతో అక్కడ పని చేస్తున్న ఇద్దరు ప్రవాస భారతీయులు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. వారిలో 10 మంది భారతీయులేనని తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో ఇప్పటిదాకా మరణించిన భారతీయుల సంఖ్య 5కు చేరింది.
ముజ్తాబాకు తీవ్ర గాయాలు: హెగ్సెత్
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డట్టు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. గాయాలతో మొజ్తబా గుర్తుపట్టలేని విధంగా మారిపోయారని ఆయన చెప్పారు. ఇరాన్‌లో ఇప్పటిదాకా 15 వేలకు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు తెలిపారు.
మా టార్గెట్ ముజ్తబా: నెతన్యాహు
ఇరాన్‌పై దాడులు ఊహించిన దాని కంటే గొప్పగా సాగుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ జీవితానికి గ్యారంటీ లేదన్నారు. ఆయనతో పాటు హెజ్బొల్లా నేత నయీం ఖాసీంను కూడా లక్ష్యం చేసుకున్నట్టు వెల్లడించారు.
ఇరాన్ లొంగుబాట: ట్రంప్
‘‘ఇరాన్ ఇప్పటికే లొంగుబాట పట్టింది. మనందరినీ వేధిస్తున్న క్యాన్సర్‌ను నిర్మూలించాను’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. జీ7 దేశాధినేతలతో జరిపిన వర్చువల్ మీటింగ్‌లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై తాము చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతమైందని ప్రకటించుకున్నారు. యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలని దేశాధినేతలు ట్రంప్‌కు సూచించారు. అంతకుముందు ట్రూత్‌సోషల్ పోస్టుల్లో ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘ఈ మతిలేని మూర్ఖులకు ఏం జరగనుందో చూస్తూండండి! వారి నేవీ, ఎయిర్‌ఫోర్స్, క్షిపణులు, డ్రోన్లు అన్నీ మట్టికరిచాయి.
సర్వమూ నాశనమవుతోంది. నాయకులు తుడిచిపెట్టుకుపోయారు. 47 ఏళ్లుగా ఇరాన్ ప్రపంచమంతటా అమాయకులను చంపుతూ వస్తోంది. 47వ అమెరికా అధ్యక్షునిగా నేను వాళ్లను చంపుతున్నా. ఎంతో గొప్ప విషయమిది!’’ అని చెప్పుకున్నారు. ఇరాన్ వద్ద పోగుపడ్డ యురేనియం నిల్వల స్వా«దీనంపై ప్రస్తుతానికి దృష్టి పెట్టడం లేదని ట్రంప్ చెప్పారు. అయితే మున్ముందు పరిస్థితి మారే ఆస్కారం లేకపోలేదన్నారు. యుద్ధంలో ఇరాన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సాయం చేస్తున్నారని కూడా ట్రంప్ అనుమానాలు వెలిబుచ్చారు.


