వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతేడాది కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ఇప్పటి వరకు అమలు చేయని కారణంగా దక్షిణ కొరియాపై టారిఫ్‌లు విధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.
ఈ సందర్భంగా ఔషధాలు, ఆటోమొబైల్ తదితర రంగాలకు చెందిన ఉత్పత్తులపై 15 నుంచి 25 శాతం వరకు టారిఫ్‌లను వసూలు చేస్తామని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య గతేడాది జూలైలో వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీన్ని దక్షిణ కొరియా పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ‘వాణిజ్య ఒప్పందాలు మాకు చాలా ముఖ్యమైనవి. ఒప్పందాలు కుదిరిన చోట్ల టారిఫ్‌లు తగ్గించుకుంటూ వస్తున్నాం. భాగస్వామ్య దేశాలు కూడా ఇదే రీతిలో స్పందిస్తాయని భావిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ హెచ్చరికలపై దక్షిణ కొరియా ప్రభుత్వం స్పందించింది. హామీ ఇచ్చిన విధంగా అమెరికాలో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని, ఒప్పందంలోని ఇతర అంశాలపై ఉన్నత స్థాయి సంప్రదింపులు కొనసాగిస్తామని తెలిపింది.


