
లార్డ్స్ టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్ (Brydon Carse)- టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravidndra Jadeja) మధ్య గొడవ జరిగింది. కార్స్ చేసిన పనికి జడ్డూ గట్టిగానే ఇచ్చిపడేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) అడ్డుగోడలా నిలబడి వారిని విడదీయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
అసలేం జరిగిందంటే.. భారత్- ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ మైదానంలో గురువారం మొదలైన మూడో టెస్టు తుది అంకానికి చేరింది. ఆఖరిదైన సోమవారం నాటి ఐదో రోజు ఆటలో విజేత ఎవరన్నది తేలనుంది. ఇంగ్లండ్ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 58/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన భారత్.. ఆరంభం నుంచే తడబడింది.
రిషభ్ పంత్ (9)ను జోఫ్రా ఆర్చర్ అద్భుత డెలివరీతో బౌల్డ్ చేయగా.. కేఎల్ రాహుల్ (39)ను స్టోక్స్ లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లగా.. నితీశ్ కుమార్‌రెడ్డి 53 బంతులు ఎదుర్కొని 13 పరుగులు చేసి నిష్క్రమించాడు.
ఫలితంగా భోజన విరామ సమయానికి భారత్ 39.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జడేజా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నంలో.. కార్స్ అతడికి అడ్డు తగిలాడు.
జడ్డూ మెడ చుట్టూ చేయి వేసి
టీమిండియా ఇన్నింగ్స్‌లో 35వ ఓవర్లో రంగంలోకి దిగిన కార్స్ బౌలింగ్‌లో.. ఆఖరి బంతికి జడ్డూ నితీశ్ రెడ్డితో కలిసి రెండు పరుగులు పూర్తి చేశాడు. అయితే, సింగిల్‌కు వెళ్లే క్రమంలో జడ్డూకు కార్స్ అడ్డుగా నిలవగా.. బంతిని చూస్తూ పరుగుకు వెళ్లిన జడ్డూ అతడిని ఢీకొట్టాడు.
దీంతో తాను పడిపోకుండా ఉండేందుకు అన్నట్లుగా... జడ్డూ మెడ చుట్టూ చేయి వేసి అతడిని బంధించేందుకు కార్స్ ప్రయత్నం చేయగా.. జడ్డూ విడిపించుకుని పరుగులు పూర్తి చేశాడు.
ఇచ్చి పడేసిన జడేజా
అనంతరం కార్స్ దగ్గరికి వచ్చి ఏంటి సంగతి అంటూ అడుగగా.. కార్స్ దురుసుగా ఎదురు సమాధానం ఇచ్చాడు. దీంతో మాటామాటా పెరగగా.. స్టోక్స్ వచ్చి ఇద్దరినీ విడదీశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా లార్డ్స్' టెస్టులో ఇలాంటి జగడాలు ఎక్కువయ్యాయి. మూడో రోజు ముగింపు సమయంలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. ఇంగ్లండ్ ఆటగాడు జాక్ క్రాలీ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఇక ఐదోరోజు రిషభ్ పంత్‌ను అవుట్ చేసిన తర్వాత జోఫ్రా ఆర్చర్ కూడా అతడిని స్లెడ్జ్ చేశాడు.
చదవండి: ఇదేం పద్ధతి?.. ఎవరి కోసం ఇదంతా?!: సునిల్ గావస్కర్ ఫైర్
Drama, more drama! 👀#ENGvIND 👉 3rd TEST, DAY 5 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/DTsJzJLwUc pic.twitter.com/eiakcyShHV
— Star Sports (@StarSportsIndia) July 14, 2025