
లార్డ్స్ టెస్టులో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ (KL Rahul) అవుటైన తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాహుల్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని విమర్శించాడు. భారత బౌలర్ల విషయంలో ఒకలా.. ఇంగ్లండ్ బౌలర్ల విషయంలో మరోలా వ్యవహరించడం సరికాదన్నాడు. పక్షపాతంగా ఉండే టెక్నాలజీ ఎవరి కోసమంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కాగా మూడో టెస్టులో ఇంగ్లండ్ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ తడబడుతోంది. 58/4 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆఖరిదైన ఐదో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాకు వరుస షాకులు తగిలాయి. కీలక బ్యాటర్ రిషభ్ పంత్ (9) జోఫ్రా ఆర్చర్ సంధించిన సూపర్ డెలివరీకి బౌల్డ్ కాగా.. ఆ వెంటనే కేఎల్ రాహుల్ (39) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) బౌలింగ్‌లో బంతి రాహుల్ ప్యాడ్‌ను తగిలినట్లు అనిపించగా.. ఇంగ్లండ్ గట్టిగా అప్పీలు చేసింది. అయితే, ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దీంతో స్టోక్స్ రివ్యూకు వెళ్లగా.. థర్డ్ అంపైర్ లెగ్ బిఫోర్ వికెట్‌గా ప్రకటించడంతో రాహుల్ క్రీజును వీడాల్సి వచ్చింది.
రీప్లేలో బంతి రాహుల్ ప్యాడ్‌ను తగిలినట్లుగా కనిపించినప్పటికీ.. బ్యాట్‌ను కూడా తాకినట్లుగా మరో శబ్దం వినిపించింది. అయితే, ముందుగా బ్యాట్‌ను తాకిందా లేదంటే ప్యాడ్‌ను తాకిందా అనేది స్పష్టంగా తేలలేదు. అయితే, బాల్ ట్రాకింగ్‌లో మాత్రం బంతి స్టంప్స్‌ను ఎగురగొట్టినట్లుగా తేల్చిన థర్డ్ అంపైర్.. రాహుల్‌ను అవుట్‌గా ప్రకటించాడు.
అసలు ఇదేం టెక్నాలజీ
ఈ విషయంపై కామెంటేటర్ సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘ఏంటో.. ఈసారి ఆశ్చర్యకరంగా ఈసారి ఎక్కువగా బౌన్స్ అవ్వనేలేదు. భారత బౌలర్లు బౌలింగ్ చేస్తున్నపుడు మాత్రం.. రివ్యూల్లో బాల్స్ అన్నీ స్టంప్స్ మీదుగా వెళ్లిపోయినట్లుగా కనిపించాయి. అసలు ఇదేం టెక్నాలజీ అని నేను ప్రశ్నిస్తున్నా’’ అంటూ ఫైర్ అయ్యాడు.
భారత్ తడ‘బ్యా’టు
కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టులో ఆఖరి రోజైన సోమవారం ఫలితం తేలనుంది. భోజన విరామ సమయానికి టీమిండియా 39.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి 81 పరుగుల దూరంలో ఉండగా.. ఇంగ్లండ్ గెలుపునకు కేవలం రెండు వికెట్లు తీస్తే చాలు.
భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0), కరుణ్ నాయర్ (14), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (6) పూర్తిగా విఫలం కాగా.. నైట్ వాచ్‌మన్ ఆకాశ్ దీప్ (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. రిషభ్ పంత్ (9), వాషింగ్టన్ సుందర్ (0), నితీశ్ కుమార్ రెడ్డి (13) నిరాశపరచగా.. ప్రస్తుతానికి భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 39 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.