IND vs ENG: సిరాజ్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ | Siraj Slapped With Hefty Fine By ICC Handed Demerit Point Here Is Why | Sakshi
Sakshi News home page

IND vs ENG: సిరాజ్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ

Jul 14 2025 1:56 PM | Updated on Jul 14 2025 4:16 PM

Siraj Slapped With Hefty Fine By ICC Handed Demerit Point Here Is Why

టీమిండియా పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj)కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) భారీ షాకిచ్చింది. అతడి మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈ మేర జరిమానా వేసింది. అంతేకాదు.. సిరాజ్‌ ఖాతాలో ఓ డీమెరిట్‌ పాయింట్‌ కూడా జతచేసింది.

సమంగా..
కాగా టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా భారత్‌ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది.  మొదటి రెండింటిలో తలా ఓ టెస్టు గెలిచి ఇరుజట్లు ప్రస్తుతం 1-1తో సమంగా న్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లార్డ్స్‌లో గురువారం మూడో టెస్టు మొదలుకాగా.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసింది.

టీమిండియా కూడా సరిగ్గా 387 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌ ఆదివారం నాటి నాలుగోరోజు ఆటలో భాగంగా 192 పరుగులకు ఆలౌట్‌ అయి.. టీమిండియాకు 193 పరుగుల లక్ష్యాన్ని విధించింది.

కీలక వికెట్లు కూల్చిన సిరాజ్‌
ఇక ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్‌.. ఇంగ్లిష్‌ జట్టు ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (12)తో పాటు.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ (4) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చి.. టీమిండియాకు బ్రేక్‌ ఇచ్చాడు. అయితే, డకెట్‌ను అవుట్‌ చేసిన సమయంలో సిరాజ్‌ ​సంబరాన్ని పట్టలేక అత్యుత్సాహం ప్రదర్శించాడు. డకెట్‌ భుజాన్ని రాసుకుంటూ వెళ్తూ వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

 

అలా అయితే ఓ మ్యాచ్‌ నిషేధం!
ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.5 నిబంధనను సిరాజ్‌ ఉల్లంఘించినట్లయింది. అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లో ఓ బ్యాటర్‌ అవుటైనపుడు వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, వారితో అనుచిత రీతిలో ప్రవర్తించడం నేరం. ఇందుకు ప్రతిగా అత్యుత్సాహం ప్రదర్శించిన బౌలర్‌కు తగిన శిక్ష పడుతుంది. 

ఇప్పుడు సిరాజ్‌ విషయంలోనూ ఇదే జరిగింది. అతడి మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించిన ఐసీసీ.. గడిచిన 24 నెలలకాలంలో సిరాజ్‌ రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు గానూ ఇప్పటికే తన ఖాతాలో ఉన్న ఓ డీమెరిట్‌ పాయింట్‌కు మరొకటి జతచేసింది.

ఒకవేళ 24 నెలల కాలంలో ఓ ప్లేయర్‌ ఖాతాలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్‌ పాయింట్లు గనుక చేరినట్లయితే అతడిపై మ్యాచ్‌ నిషేధం పడుతుంది. ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి ఆట పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 135 దూరంలో నిలిచింది. 

చదవండి: Divorce: సైనా అలా.. పారుపల్లి కశ్యప్‌ ఇలా!.. ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement