
Saina Nehwal- Parupalli Kashyap Divorce: భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్స్ పతక విజేత సైనా నెహ్వాల్ (Saina Nehwal) తన భర్త పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap)తో విడిపోతున్నట్లు ప్రకటించింది. తాము సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆదివారం రాత్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ప్రకటన విడుదల చేసిన సైనా
ఈ మేరకు.. ‘‘జీవితం మనల్ని ఒక్కోసారి వేర్వేరు దిశల్లో ప్రయాణం చేయిస్తుంది. సుదీర్ఘ చర్చలు, ఆలోచనల తర్వాత.. నేను కశ్యప్ పారుపల్లి విడిపోవాలని నిర్ణయించుకున్నాం.
శాంతియుత జీవనం, ఎదుగుదల, మానసిక ప్రశాంతత మా ఇరువురికీ ముఖ్యమని భావించి వేర్వేరు దారుల్లో ప్రయాణించాలని భావించాము. మా ఇద్దరి బంధానికి సంబంధించి నాకెన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఇక ముందు కూడా స్నేహితుల్లా ముందుకు సాగుతాం.
ఇలాంటి క్లిష్ట సమయంలో మా గోప్యత, గౌరవానికి భంగం కలగకుండా మా నిర్ణయాన్ని గౌరవించాలని కోరుకుంటున్నా’’ అని సైనా నెహ్వాల్ ఇన్‌స్టా స్టోరీ ద్వారా తమ విడాకుల విషయాన్ని వెల్లడించింది.
బెస్టెస్ట్ అంటూ కశ్యప్ స్టోరీ
అయితే, అదే సమయంలో పారుపల్లి కశ్యప్ మాత్రం విడాకుల గురించి ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. అంతేకాదు.. సైనా కంటే ముందే ఓ పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇందులో కశ్యప్ తన స్నేహితులతో కలిసి వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను రీషేర్ చేస్తూ.. ‘‘బెస్టెస్ట్’’ అంటూ స్టోరీ పెట్టాడు.
కపుల్ గోల్స్ సెట్ చేసిన క్రీడా జంట.. అంతలోనే..
అయితే, సైనాతో ఉన్న పాత ఫొటోలన్నీ కూడా పారుపల్లి కశ్యప్ అలాగే ఉంచాడు. ఆమెతో కలిసి టూర్లకు వెళ్లిన ఫొటోలన్నీ తన సోషల్ మీడియా అకౌంట్లో అలాగే అట్టిపెట్టుకున్నాడు. కాగా భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ దగ్గర శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్ చాలా ఏళ్లపాటు ప్రేమించుకున్నారు. 2018లో పెళ్లి బంధంతో ఒక్కటైన వీరు అన్యోన్యంగా ఉండేవారు. కెరీర్ పరంగానూ ఒకరికొరు అండగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేసే వాళ్లు.
కానీ అకస్మాత్తుగా ఇలా సైనా నుంచి విడాకుల ప్రకటన రాగా.. కశ్యప్ మాత్రం ఇంకా స్పందించకపోవడం గమనార్హం. కాగా సైనాకు ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు భర్త కశ్యప్‌తో పాటు టూర్లకు వెళ్లే సైనా.. మరికొన్ని సార్లు తన తల్లిదండ్రులతో కలిసి ప్రయాణాలు చేసేది. ఇందుకు సంబంధించిన జ్ఞాపకాలను ఫొటోల రూపంలో తన సోషల్ మీడియాలో షేర్ చేసేది సైనా.
ఇక భర్తతో ఉన్న మధురానుభూతులను కూడా కెమెరాతో ఒడిసిపట్టి అభిమానులతో పంచుకునేది. చివరగా ఈ ఏడాది మేలో సైనా, కశ్యప్ సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ సంతోషంగా గడిపిన క్షణాలను సైనా షేర్ చేసింది. అయితే, వీరి మధ్య విభేదాలు, విడాకులకు గల కారణం ఏమిటో మాత్రం తెలియదు.
కెరీర్‌లో బెస్ట్
కాగా సైనా లండన్ ఒలింపిక్స్-2012లో మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం గెలవగా.. అదే ఎడిషన్‌లో కశ్యప్ మెన్స్ సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా కశ్యప్ చరిత్ర సృష్టించాడు.