
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సైనా తమ విడాకుల విషయాన్ని ఆదివారం రాత్రి పోస్ట్ చేసింది. ‘జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశలకు తీసుకెళుతుంది. ఎంతో ఆలోచించి, సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాత నేను, కశ్యప్ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాం. పరస్పర అవగాహనతో సహృద్భావ వాతావరణంలో మా విడాకులు తీసుకుంటున్నాం.
కశ్యప్‌తో నాకు ఎన్నో తీపి గుర్తులున్నాయి.ఇకపై మిత్రులుగా ఉంటాం. మా నిర్ణయాన్ని అందరు స్వాగతిస్తారని, ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్‌లు 2018లో పెళ్లి చేసుకున్నారు. సైనా రెండుసార్లు కామన్వెల్త్ చాంపియన్‌గా నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.