
ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు టీమిండియా (Ind vs Eng) సిద్ధమైంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇరుజట్ల మధ్య గురువారం నుంచి టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఇప్పటికే తమ తుదిజట్టును ప్రకటించగా.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రావడం లాంఛనమే.
అయితే, బుమ్రా రాక వల్ల ఎవరిపై వేటు పడుతుందనే చర్చ నడుస్తుండగా.. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఈ విషయంపై స్పందించాడు. ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna)ను జట్టు నుంచి తప్పించడం ఖాయమేనని స్పష్టం చేశాడు. కాగా లీడ్స్ వేదికగా తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. బర్మింగ్‌హామ్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే.
1-1తో సమం
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆతిథ్య జట్టును ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా లేకపోయినా.. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాశ్ దీప్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మొత్తంగా పది వికెట్లు కూల్చి భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
ఇక సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ సైతం ఏడు వికెట్లతో సత్తా చాటగా.. ప్రసిద్ కృష్ణ మాత్రం కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు. పేస్ దళంలో అతడొక్కడే ఇలా పూర్తిగా నిరాశపరిచాడు. బర్మింగ్‌హామ్‌లో మొత్తంగా 27 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ కర్ణాటక పేసర్.. 111 పరుగులు ఇచ్చుకున్నాడు.
ప్రసిద్ కృష్ణపై వేటుపడక తప్పదు
ఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. బుమ్రా రాక కారణంగా ప్రసిద్ కృష్ణపై వేటుపడకతప్పదు. రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు.
లీడ్స్‌లోనూ అంతే. వికెట్లు తీసినప్పటికీ జట్టుకు పెద్దగా ఉపయోగపడే ప్రదర్శన చేయలేదు’’ అని పేర్కొన్నాడు. కాబట్టి మేనేజ్‌మెంట్ అతడికి మరో అవకాశం ఇవ్వదని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. పచ్చికతో కూడుకున్న లార్డ్స్ పిచ్ ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించనుందన్న విశ్లేషణల నడుమ.. నలుగురు ఫ్రంట్‌లైన్ పేసర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్‌లతో పాటు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో ఈ మేరకు నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, పిచ్ స్వభావాన్ని బట్టి తాము 3+1 లేదంటే 3+2 కాంబినేషన్‌తో బరిలోకి దిగుతామని టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ వెల్లడించాడు.
మూడో టెస్టుకు భారత తుదిజట్టు అంచనా
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.
ఇంగ్లండ్ తుదిజట్టు
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇంగ్లండ్ గడ్డపై తొలి సిరీస్ కైవసం