
మహిళల క్రికెట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న (జులై 9) జరిగిన నాలుగో టీ20 భారత్ 6 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్‌ను చేజిక్కించకుంది.
2012 నుంచి ఇంగ్లండ్‌లో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు ఆడుతున్న భారత్ తొలిసారి విజయఢంకా మోగించింది. భారత్‌కు ఇంగ్లండ్‌పై వారి దేశంలో కాని స్వదేశంలో కాని ఇదే తొలి టీ20 సిరీస్ గెలుపు. టీమిండియా ఇంగ్లండ్‌లో ఇప్పటివరకు నాలుగు టీ20 సిరీస్‌లు ఆడగా.. ఇంగ్లండ్ 3, భారత్ 1 గెలిచాయి. 2012, 2021, 2022 సిరీస్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందగా.. ప్రస్తుత సిరీస్‌లో (2025) భారత్ విజేతగా నిలిచింది.
ఈ సిరీస్‌లో నామమాత్రపు చివరి మ్యాచ్ బర్మింగ్హమ్ వేదికగా జులై 12న జరుగనుంది. ఈ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. జులై 16, 19, 22 తేదీల్లో సౌతాంప్టన్, లార్డ్స్, చెస్టర్ లీ స్ట్రీట్‌లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
నాలుగో టీ20 విషయానికొస్తే.. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయగా.. టీమిండియా స్పిన్నర్లు చెలరేగిపోయారు. రాధా యాదవ్ (4-0-15-2), శ్రీ చరణి (4-0-30-2), దీప్తి శర్మ (4-0-29-1) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు.
పేసర్లు అమన్‌జోత్ కౌర్ (4-0-20-1), అరుంధతి రెడ్డి (3-0-16-0) కూడా పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ సోఫీ డంక్లీ (22) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కెప్టెన్ బేమౌంట్ (20), అలైస్ క్యాప్సీ (18), స్కోల్‌ఫీల్డ్ (16), ఎక్లెస్టోన్ (16 నాటౌట్), వాంగ్ (11 నాటౌట్) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ మరో 3 ఓవర్లు మిగిలుండగానే సునాయాసంగా ఛేదించింది. స్మృతి మంధన 32, షఫాలీ వర్మ 31, జెమీమా రోడ్రిగెజ్ 24 (నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ 26 , రిచా ఘోష్ 7 (నాటౌట్) పరుగులు చేసి భారత్‌ను గెలపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లోట్ డీన్, ఎక్లెస్టోన్, వాంగ్ తలో వికెట్ తీశారు.