
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) మరోసారి అంపైర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పదే పదే ఇలా చేయడం సరికాదంటూ ఫీల్డ్ అంపైర్ వ్యవహారశైలిని విమర్శించాడు. అసలేం జరిగిందంటే.. భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య లార్డ్స్ వేదికగా గురువారం (జూలై 10) మూడో టెస్టు మొదలైంది.
ఆదిలోనే షాకులు
టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి 83 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఈ క్రమంలో 251/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు బుమ్రా ఆదిలోనే షాకులు తగిలాయి. బెన్ స్టోక్స్ (44), క్రిస్ వోక్స్ (0), జో రూట్ (104) వికెట్లు కూల్చి బ్రేక్ ఇచ్చాడు.
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 91వ ఓవర్ మధ్యలో కొత్త బంతి కావాలని టీమిండియా అడిగింది. 10.4 ఓవర్ల తర్వాత బంతిని మార్చాలని కోరగా.. అంపైర్ నుంచి వెంటనే సానుకూల స్పందన రాలేదు.
అయితే, హూప్ టెస్టులో బంతి ఫెయిల్ కాగా.. అంపైర్ కొత్త బంతి ఇచ్చాడు. అయితే, అది చూసిన గిల్.. పాత బంతితో దీనికి ఏమాత్రం పోలిక లేదంటూ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశాడు.
పాతబడిన బంతిలా ఉందా? నిజమా?
ఇంతలో బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కూడా వచ్చి.. ‘‘ఇది పది ఓవర్ల తర్వాత పాతబడిన బంతిలా ఉందా? నిజమా?’’ అంటూ సెటైర్ వేశాడు. అతడి మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. ఏదేమైనా అంపైర్ ఇచ్చిన కొత్త బంతితో గిల్, సిరాజ్ అసంతృప్తి చెందినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు
ఈ నేపథ్యంలో అంపైర్ తీరును విమర్శిస్తూ టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ తనదైన శైలిలో చణుకులు విసిరాడు. ‘‘ఇక్కడ కూర్చుని చూసినా.. అది పది ఓవర్లు పాత బడిన బంతిలా కాదు.. 20 ఓవర్లకు పైనే వాడిన బంతిలా కనిపిస్తోంది.
ఒకవేళ ఇదే ఇండియాలో జరిగి ఉంటేనా.. బ్రిటిష్ మీడియా ఎంతలా గంతులు వేసేదో’’ అంటూ గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులోనూ గిల్, పంత్ బంతిని మార్చే విషయంలో అంపైర్లతో గొడవపడిన విషయం తెలిసిందే. ఇక లార్డ్స్ మ్యాచ్ విషయానికొస్తే.. శుక్రవారం ఆటలో భాగంగా 112.3 ఓవర్లలో 387 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది.
చదవండి: 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా.. 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
Shubman Gill got angry on the field looking like Ricky Ponting is back 🥶⁰#INDvsENG #ENGvIND
pic.twitter.com/lsmX5AYZU7— Kavya Maran (@Kavya_Maran_SRH) July 11, 2025