
PC: ICC
ఇటలీ క్రికెట్ జట్టు (Italy Cricket Team) చరిత్ర సృష్టించింది. తొలిసారి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. యూరప్ జోన్ నుంచి నెదర్లాండ్స్‌తో పాటు ఇటలీ మెగా ఈవెంట్‌లో తమ బెర్తును ఖరారు చేసుకుంది. యూరప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇటలీ నెదర్లాండ్స్‌తో తలపడింది.
భారత్- శ్రీలంక వేదికగా..
అయితే, ఈ మ్యాచ్‌లో ఇటలీ ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయినప్పటికీ.. పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా నెదర్లాండ్స్‌తో పాటు టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నీలో పోటీపడే అవకాశం దక్కించుకుంది. కాగా భారత్- శ్రీలంక (India- Sri Lanka) వచ్చే ఏడాది సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే.
ఆ ఏడు జట్లు కూడా..
ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్ల హోదాలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా, శ్రీలంక నేరుగా ప్రపంచకప్-2026కు అర్హత సాధించాయి. ఇక వీటితో పాటు టీ20 ప్రపంచకప్-2024లో టాప్-7లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, యూఎస్‌ఏ, వెస్టిండీస్ కూడా క్వాలిఫై అయ్యాయి.
మరోవైపు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ కూడా ఈ టోర్నీలో పోటీపడేందుకు బెర్తును ఖరారు చేసుకున్నాయి. ఇక అమెరికా క్వాలిఫయర్స్ నుంచి కెనడా.. తాజాగా యూరప్ క్వాలిఫయర్ నుంచి నెదర్లాండ్, ఇటలీ కూడా వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ ఆడే అవకాశం దక్కించుకున్నాయి.
20 జట్లలో 15 ఖరారు
కాగా ఈ మెగా టోర్నీలో మొత్తంగా 20 జట్లు పాల్గొననుండగా.. ఇప్పటికి పదిహేను జట్లు ఈ మేర అర్హత సాధించగా.. ఇంకో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో రెండు స్థానాల కోసం సౌతాఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా నమీబియా, ఉగాండా, టాంజానియా, కెన్యా, జింబాబ్వే, బోత్స్వానా, నైజీరియా పోటీపడుతున్నాయి.
ఇక మిగిలిన మరో మూడు స్థానాల కోసం ఆసియా- ఈఏపీ క్వాలిఫయర్స్ (అక్టోబరు 1-17) నుంచి నేపాల్, ఒమన్, పపువా న్యూగినియా, సమోవా, కువైట్, మలేషియా, జపాన్, కతార్, యూఏఈ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఇదిలా ఉంటే.. 2024లో అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. లీగ్ దశలో అజేయంగా నిలిచిన రోహిత్ సేన.. ఫైనల్లో సౌతాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది.
తద్వారా రెండోసారి పొట్టి ప్రపంచకప్ భారత్ సొంతమైంది. కాగా 2007లో తొలిసారి టీ20 వరల్డ్‌కప్ పోటీ ప్రవేశపెట్టగా ధోని సారథ్యంలో నాడు భారత్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచకప్-2026లో ఇప్పటికి అర్హత సాధించిన జట్లు ఇవే..
టీమిండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, యూఎస్‌ఏ, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా, నెదర్లాండ్స్, ఇటలీ.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్