
ద హేగ్ (నెదర్లాండ్స్): మీరు చదువుతున్నది నిజమే... క్రికెట్ క్రీడలో ఇటలీ జట్టు ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 పురుషుల వరల్డ్ కప్ టోర్నీకి యూరోప్ జోన్ నుంచి ఇటలీతోపాటు నెదర్లాండ్స్ జట్లు అర్హత పొందాయి. ఫుట్‌బాల్‌లో ఇటలీకి ఘనమైన రికార్డు ఉంది. మూడుసార్లు ప్రపంచకప్‌ను సాధించడంతోపాటు రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది.
ఏ స్థాయి క్రికెట్‌లో అయినా ఇటలీ జట్టు వరల్డ్‌కప్ బెర్తు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా ఓవరాల్‌గా ఈ మెగా టోర్నీ బరిలోకి దిగనున్న 25వ జట్టుగా ఇటలీ నిలిచింది. టి20 ప్రపంచకప్ యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇటలీ 9 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. అయినప్పటికీ... గ్రూప్‌లో 4 మ్యాచ్‌లాడిన ఇటలీ 2 విజయాలు, 1 పరాజయం, ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో 5 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ముందంజ వేసింది.
గతంలో ఆస్ట్రేలియా జట్టు తరఫున 23 టెస్టులు, 6 వన్డేలు ఆడిన జో బర్న్స్ ఇటలీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక చివరి లీగ్ మ్యాచ్‌లో ఇటలీపై గెలిచిన నెదర్లాండ్స్ 6 పాయింట్లతో దర్జాగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. తద్వారా గత నాలుగు టి20 ప్రపంచకప్‌లలో బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు ఈసారి మెగా టోర్నీ ఆడే అవకాశం కోల్పోయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్ జట్టు జెర్సీ జట్టు చేతిలో ఒక వికెట్ తేడాతో ఓడింది. దీంతో పట్టికలో నాలుగో స్థానానికి పరిమితమై వరల్డ్‌కప్‌నకు దూరమైంది.