
జొహన్నెస్‌బర్గ్: క్రీడల్లో ఏ రికార్డూ శాశ్వతం కాదని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. ఇటీవల జింబాబ్వేతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ అజేయంగా 367 పరుగులు చేశాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి చూస్తే సఫారీ జట్టుకు చాలా సమయం ఉండగా... సారథ్య బాధ్యతలు కూడా అతడి వద్దే ఉండటంతో ముల్డర్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన లారా (400) రికార్డును బద్దలు కొడతాడని అందరూ భావించారు.
అయితే అందుకు భిన్నంగా ముల్డర్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఆశ్చర్యపరిచాడు. అనంతరం అతడు మాట్లాడుతూ... విండీస్ దిగ్గజం లారాపై గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ అంశంపై లారా తనతో ముచ్చటించినట్లు ముల్డర్ పేర్కొన్నాడు. ‘లారాతో ఇటీవలే దీని గురించి మాట్లాడా. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టేందుకే అని చెప్పాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కోసం ప్రయతి్నంచి ఉండాల్సిందన్నాడు. నీకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కేదని ప్రోత్సహించాడు.
మరోసారి అలాంటి అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని సూచించాడు. అది అతడి గొప్పతనం. నా వరకైతే నేను చేసింది సరైందే. ఆ రికార్డు అతడి లాంటి లెజండ్ పేరిట ఉండటమే సబబు’ అని ముల్డర్ అన్నాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ల జాబితాలో ముల్డర్ ఐదో స్థానానికి చేరాడు.