
పొలార్డ్ (PC: MI New York X)
మేజర్ లీగ్ క్రికెట్-2025 (MLC) టోర్నమెంట్లో ఎంఐ న్యూయార్క్ జట్టు ఫైనల్ చేరింది. టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఓడించి రెండోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ టీ20 టోర్నీ చాలెంజర్ మ్యాచ్‌లో భాగంగా శనివారం ఎంఐ న్యూయార్క్- టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి.
డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సూపర్ కింగ్స్ ఆదిలోనే ఓపెనర్ స్మిత్ పాటిల్ (9) వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన సాయితేజ ముక్కామల్ల (1).. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన శుభమ్ రంజానే (1), మార్కస్ స్టొయినిస్ (6) పెవిలియన్‌కు వరుస కట్టారు.
రాణించిన డుప్లెసిస్..బ్యాట్ ఝులిపించిన అకీల్
ఇలాంటి తరుణంలో మరో ఓపెనింగ్ బ్యాటర్, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (Faf Du Plesis) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 42 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులతో రాణించాడు. అతడికి తోడుగా స్పిన్నర్ అకీల్ హుసేన్ బ్యాట్ ఝులిపించాడు.
కేవలం 32 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 55 పరుగులతో అకీల్ నాటౌట్‌గా నిలవగా.. డొనొవాన్ ఫెరీరా (20 బంతుల్లో 32 నాటౌట్) దంచికొట్టాడు. ఈ ముగ్గురి ఇన్నింగ్స్ కారణంగా సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగలిగింది.
ఎంఐ న్యూయార్క్ బౌలర్లలో ట్రిస్టస్ లస్ మూడు వికెట్లు కూల్చగా.. రుషిల్ ఉగార్కర్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్ ఆరంభంలోనే క్వింటన్ డి కాక్ (6) రూపంలో కీలక వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ మైకేల్ బ్రేస్‌వెల్ (8) కూడా పూర్తిగా విఫలమయ్యాడు.
పూరన్ ధనాధన్
ఈ క్రమంలో మరో ఓపెనర్ మోనాంక్ పటేల్ (49) ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. నికోలస్ పూరన్ (Nicholas Pooran) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 36 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 52 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉన్నాయి.
Pooran goes down the ground. Pooran goes out of the ground. 🙌#OneFamily #MINewYork #MLC #TSKvMINY pic.twitter.com/MWrsE5HOyC
— MI New York (@MINYCricket) July 12, 2025
పొలార్డ్ విధ్వంసం
మరోవైపు.. సీనియర్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ మరోసారి తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సూపర్ కింగ్స్ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. సునామీ ఇన్నింగ్స్ (22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు- 47 పరుగులు)తో విరుచుకుపడి.. పూరన్‌తో కలిసి ఎంఐ న్యూయార్క్‌ను విజయతీరాలకు చేర్చాడు. పూరన్, పొలార్డ్ ధనాధన్ దంచికొట్టడంతో 19 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి ఎంఐ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా మేజర్ లీగ్ క్రికెట్‌లో రెండోసారి ఫైనల్‌ల్లో అడుగుపెట్టింది.
Death
Taxes
Pollard smashing it 🆚 the Super Kings 💥#OneFamily #MINewYork #MLC #TSKvMINY pic.twitter.com/qdvYfEWnnm— MI New York (@MINYCricket) July 12, 2025
కాగా టెక్సాస్ సూపర్ కింగ్స్- వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరగాల్సిన క్వాలిఫయర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో టెక్సాస్ జట్టు (14)తో పోలిస్తే పాయింట్ల పరంగా మెరుగ్గా ఉన్న వాషింగ్టన్ (16) నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో చాలెంజర్ రూపంలో సూపర్ కింగ్స్‌కు మరో అవకాశం లభించగా.. ఎంఐ జట్టు చేతిలో భంగపాటే ఎదురైంది.
మరోవైపు.. శాన్ ఫ్రాన్సిస్కోతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన ఎంఐ న్యూయార్క్ జట్టు.. తాజాగా సూపర్ కింగ్స్‌పై కూడా గెలిచి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. డల్లాస్‌లో ఆదివారం (జూలై 13) టైటిల్ పోరులో వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్