
నేడు భారత్, ఇంగ్లండ్ మహిళల ఐదో టి20
ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా
రాత్రి గం. 11:05 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌పై తొలి టి20 సిరీస్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు... నామమాత్రమైన చివరి మ్యాచ్‌లోనూ అదే జోరు కనబర్చాలని ఆశిస్తోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 3–1తో దక్కించుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా... శనివారం ఆతిథ్య జట్టుతో ఆఖరి మ్యాచ్ ఆడుతుంది. గతంలో ఇంగ్లండ్‌పై టెస్టు, వన్డే సిరీస్‌లు గెలిచిన భారత జట్టు... తాజాగా తొలి టి20 సిరీస్ ఖాతాలో వేసుకుంది. టాపార్డర్ చక్కటి ఫామ్‌లో ఉండగా... స్పిన్నర్లు సత్తా చాటుతుండటంతో టీమిండియా ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయగలిగింది.
ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే... మనవాళ్ల ఫీల్డింగ్ ఎంతో మెరుగైంది. నాలుగో టి20ని పరిశీలిస్తే... బౌండరీకి సమీపంలో హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి చూడచక్కని క్యాచ్‌లు అందుకోగా... 30 గజాల సర్కిల్‌లో రాధా యాదవ్ తన ఫీల్డింగ్ విన్యాసాలతో కట్టిపడేసింది. ఫలితంగానే ఇంగ్లండ్ జట్టు 126 పరుగులకు పరిమితమైంది. అనంతరం టాపార్డర్ రాణించడంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది. అదే జోరు చివరి మ్యాచ్‌లోనూ కొనసాగించి ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాలని హర్మన్‌ప్రీత్ బృందం భావిస్తోంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
ఇటీవల భారత పురుషుల జట్టు రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై గెలిచిన మైదానంలోనే ఈ మ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్‌లో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, షఫాలీ వర్మ జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తుండగా... జెమీమా రోడ్రిగ్స్, అమన్‌జ్యోత్ కౌర్ నిలకడ కనబరుస్తున్నారు. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫర్వాలేదనిపిస్తున్నా... ఆమె స్థాయికి అది తక్కువే. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు హర్మన్ నుంచి టీమ్ మేనేజ్‌మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఈ సిరీస్‌లో భారత జట్టు జైత్రయాత్ర వెనక స్పిన్నర్ల కృషి ఎంతో ఉంది.
నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి స్పిన్నర్లే 22 వికెట్లు తీశారు. ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ టి20 అరంగేట్రం చేసిన ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ శ్రీ చరణి ప్రత్యర్థిని తన మాయాజాలంతో ముప్పుతిప్పలు పెడుతోంది. రాధా యాదవ్, దీప్తి శర్మ కూడా మంచి లయలో ఉన్నారు. మరోవైపు సొంతగడ్డపై గాయాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో నెగ్గి వన్డే సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని భావిస్తోంది.