ఫైనల్‌ రిహార్సల్‌... | India vs New Zealand first T20 on Jan 21 in Nagpur | Sakshi
Sakshi News home page

ఫైనల్‌ రిహార్సల్‌...

Jan 21 2026 2:16 AM | Updated on Jan 21 2026 2:16 AM

India vs New Zealand first T20 on Jan 21 in Nagpur

అర్ష్‌దీప్, సామ్సన్, అక్షర్‌ పటేల్‌

నాగ్‌పూర్‌లో నేడు భారత్, న్యూజిలాండ్‌ తొలి టి20

తుది జట్టు కూర్పుపై టీమిండియా దృష్టి

 జోరు మీదున్న కివీస్‌ బృందం

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం  

భారత జట్టు 2024లో టి20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత వరుసగా ఎనిమిది సిరీస్‌లలో విజేతగా నిలిచింది. సరిగ్గా చెప్పాలంటే 36 మ్యాచ్‌లు ఆడితే 29 గెలిచి, 5 మాత్రమే ఓడిందంటే టీమ్‌ ఎలాంటి ఫామ్‌లో ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు మరో వరల్డ్‌కప్‌ టైటిల్‌ వేటలో చివరి రిహార్సల్‌గా సొంతగడ్డపై ఈ ఫార్మాట్‌లో పోరుకు టీమిండియా సిద్ధమైంది. అయితే ఈ విజయాల పర్వంలో తాము ఒక్కసారి కూడా తలపడని న్యూజిలాండ్‌ ఇప్పుడు ప్రత్యర్థిగా ఉంది. సంచలనాల కివీస్‌ను రెండేళ్లుగా టి20ల్లో భారత్‌ ఎదుర్కోలేదు. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్‌ ఫలితం తర్వాత ఇప్పుడు టి20 సిరీస్‌ ఆసక్తిని రేపుతోంది.

నాగ్‌పూర్‌: టి20 వరల్డ్‌ కప్‌కు ముందు చివరి సన్నాహకం కోసం భారత్, న్యూజిలాండ్‌ సన్నద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి పోరు జరగనుంది. ఇటీవల సిరీస్‌ ఆడిన వన్డే టీమ్‌తో పోలిస్తే ఒకరిద్దరు మినహా భారత బృందం పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. మరోవైపు కివీస్‌ కూడా రెగ్యులర్‌ సభ్యులు అందుబాటులోకి రావడంతో పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది.

టి20 వరల్డ్‌ కప్‌ ఇక్కడే జరగనుండటం, రెండు టీమ్‌లు కూడా ఐసీసీ టోరీ్నలో ఆడే టీమ్‌నే దాదాపుగా ఎంపిక చేయడంతో ఈ సిరీస్‌ సరైన ప్రాక్టీస్‌ కానుంది. తమ బలాబలాలను అంచనా వేసుకోవడంతో పాటు తుది జట్టు కూర్పుపై కూడా జట్లు దృష్టి పెట్టాయి. అనూహ్యంగా వన్డే సిరీస్‌ విజయంతో ఆత్మవిశ్వాసం పెరిగిన న్యూజిలాండ్‌ను భారత్‌ తక్కువగా అంచనా వేస్తే అదే ఫలితం పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది.  

స్టార్లంతా సిద్ధం... 
బుమ్రా వచ్చేశాడు, హార్దిక్‌ పాండ్యా కూడా వచ్చాడు... మెరుపు ఆరంభాలకు అభిషేక్‌ శర్మ, సామ్సన్‌ కూడా సిద్ధం. ఎప్పటిలాగే భారత టి20 జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. జట్టులో ప్రతీ ఆటగాడు ఒంటిచేత్తో విజయం అందించే స్థాయిలో ఉన్నాడు. ఆల్‌రౌండర్‌గా అక్షర్‌ పటేల్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. బుమ్రా, పాండ్యాలు సత్తా చాటితే టీమిండియాకు ఎదురే ఉండదు. శస్త్ర చికిత్స కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన తిలక్‌ వర్మకు బదులుగా శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపిక చేసినా... మూడో స్థానంలో ఇషాన్‌ కిషన్‌ ఆడతాడని కెప్టెన్‌ సూర్యకుమార్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో బ్యాటింగ్‌ ఆర్డర్‌ విషయంలో కూడా సందేహాలు లేవు.

ఏడు, ఎనిమిది స్థానాల్లో హిట్టర్లు రింకూ సింగ్, శివమ్‌ దూబే ఆడటం అంటే జట్టు బ్యాటింగ్‌ లోతు ఏమిటో తెలుస్తోంది. ఇద్దరు రెగ్యులర్‌ స్పిన్నర్లుగా కుల్దీప్‌ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి భారం మోస్తారు. వన్డే సిరీస్‌లో కుల్దీప్‌ ప్రభావం చూపకపోయినా... టి20ల్లో ప్రత్యర్థిని కుప్పకూల్చగల సమర్థుడు. ఇన్ని సానుకూలతల మధ్య ఏదైనా ఆందోళన ఉందంటే అది కెప్టెన్‌ సూర్య ఫామ్‌ గురించి మాత్రమే. గత 22 ఇన్నింగ్స్‌లలో అతను అర్ధసెంచరీ సాధించలేకపోయాడు. జట్టు సారథిగా, విధ్వంసకర బ్యాటర్‌గా తనకున్న గుర్తింపును ప్రదర్శించేందుకు ఈ సిరీస్‌ అతనికి సరైన వేదిక. కెరీర్‌లో ఇది సూర్యకు 100వ టి20 మ్యాచ్‌ కానుంది.  

మిచెల్, ఫిలిప్స్‌పై దృష్టి... 
న్యూజిలాండ్‌ వన్డేల తరహాలో ఈ సిరీస్‌ కోసం కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే వన్డేల్లో సత్తా చాటిన డరైల్‌ మిచెల్, గ్లెన్‌ ఫిలిప్స్‌ మరోసారి భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. టి20ల్లో మిచెల్‌కు కూడా మెరుగైన రికార్డు ఉండగా, ఫిలిప్స్‌ దూకుడుకు మారుపేరు. వన్డేల్లో విఫలమైన కాన్వే ఇక్కడ మెరుగ్గా ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. కివీస్‌ కూడా పలువురు టి20 స్పెషలిస్ట్‌లు చాప్‌
మన్, డఫీ, సోధిలకు అవకాశం కల్పిస్తోంది. పేసర్‌ డఫీ చక్కటి ఫామ్‌లో ఉండగా... రచిన్‌ రవీంద్ర, కెప్టెన్‌ సాంట్నర్‌ విరామం తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చారు. ఇటీవల ఆ్రస్టేలియాపై మెరుపు సెంచరీ చేసిన రాబిన్సన్‌ ఓపెనర్‌గా చెలరేగిపోగలడు.     

1210    భారత్, న్యూజిలాండ్‌ మధ్య మొత్తం 25 టి20లు జరగ్గా... భారత్‌ 12 గెలిచి 10 ఓడింది. మరో 3 మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. భారత్‌లో 2017, 2023లలో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లు జరగ్గా... రెండూ భారత్‌ గెలిచింది.

తుది జట్లు (అంచనా) 
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్‌), అభిషేక్, సామ్సన్, ఇషాన్‌ కిషన్, పాండ్యా, అక్షర్, రింకూ, దూబే, కుల్దీప్, బుమ్రా, వరుణ్‌. న్యూజిలాండ్‌: సాంట్నర్‌ (కెప్టెన్‌), రాబిన్సన్, కాన్వే, రచిన్, మిచెల్, ఫిలిప్స్, చాప్‌మన్, నీషమ్, హెన్రీ, సోధి, డఫీ.  
    
పిచ్, వాతావరణం
బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా అనుకూలించే మంచి స్పోర్టింగ్‌ వికెట్‌. అయితే స్పిన్నర్లు కొంత అదనపు ప్రభావం చూపగలరు. దేశంలో పెద్ద బౌండరీలు ఉన్న మైదానాల్లో ఒకటి కాబట్టి భారీ స్కోర్లు కష్టం. వర్షం సమస్య లేదు.

సినెర్‌ గెలుపు బోణీ  ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో శుభారంభం చేసిన డిఫెండింగ్‌ చాంపియన్‌

ఐపీఎల్‌లో ‘జెమినై’
రూ. 270 కోట్లతో ఒప్పందం
న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) స్పాన్సర్ల సుదీర్ఘ జాబితాలో ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక సంస్థ కూడా చేరింది. గూగుల్‌కు చెందిన ఏఐ ప్లాట్‌ఫామ్‌ ‘జెమినై’ ఐపీఎల్‌లో భాగస్వామిగా మారుతూ బీసీసీఐతో జత కట్టింది. ఇందు కోసం మూడేళ్ల కాలానికి ‘జెమినై’ రూ. 270 కోట్లు చెల్లిస్తుంది. భారత క్రికెట్‌లో ఏఐ ప్లాట్‌ఫామ్‌ల పాత్ర పెరిగేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారుతుందని బీసీసీఐ భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌లో మరో ప్రముఖ సంస్థ, ‘జెమినై’కి పోటీదారు అయిన చాట్‌ జీపీటీ ఇప్పటికే మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో స్పాన్సర్‌గా ఉండటం విశేషం. గత నవంబర్‌లోనే బీసీసీఐ ఈ ఒప్పందం చేసుకుంది. 2026 ఐపీఎల్‌ సీజన్‌ మార్చి 26 నుంచి మే 31 వరకు జరుగుతుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement