టైటిల్‌ నిరీక్షణ ముగించేందుకు... స్విస్‌ ఓపెన్‌ బరిలో శ్రీకాంత్‌ | PV Sindhu Set To Skip After Dubai Ordeal: Srikanth Will Spearhead Indian Challenge | Sakshi
Sakshi News home page

టైటిల్‌ నిరీక్షణ ముగించేందుకు... స్విస్‌ ఓపెన్‌ బరిలో శ్రీకాంత్‌

Mar 10 2026 1:22 PM | Updated on Mar 10 2026 1:29 PM

 PV Sindhu Set To Skip After Dubai Ordeal: Srikanth Will Spearhead Indian Challenge

గత ఏడాది రెండు టైటిల్స్‌కు విజయం దూరంలో ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్‌ షట్లర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ మరోసారి టైటిల్‌ వేటకు సిద్ధమయ్యాడు. నేడు మొదలయ్యే స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోరీ్నలో శ్రీకాంత్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

తొలి రౌండ్‌లో ప్రపంచ 42వ ర్యాంకర్‌ జేసన్‌ గుణవాన్‌ (హాంకాంగ్‌)తో శ్రీకాంత్‌ తలపడతాడు. తొలి రోజు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. గత సంవత్సరం మలేసియా మాస్టర్స్, సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న శ్రీకాంత్‌ ఈ సీజన్‌లో టైటిల్‌ నిరీక్షణకు తెర దించాలని పట్టుదలతో ఉన్నాడు.

శ్రీకాంత్‌ చివరిసారి 2017లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఆ తర్వాత అతను మరో అంతర్జాతీయ టోరీ్నలో టైటిల్‌ సాధించలేదు. శ్రీకాంత్‌తోపాటు స్విస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో భారత్‌ తరఫున హెచ్‌ఎస్‌ ప్రణయ్, ఆయుశ్‌ శెట్టి, కిరణ్‌ జార్జి, తరుణ్‌ మన్నేపల్లి పోటీపడుతున్నారు. క్వాలిఫయింగ్‌లో శంకర్‌ ముత్తుస్వామి బరిలో ఉన్నాడు.

మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత నంబర్‌వన్‌ పీవీ సింధు ఈ టోరీ్నకి దూరంగా ఉంది. వాస్తవానికి సింధు ఎంట్రీ ఖరారు చేసినా... ఇటీవల ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు దుబాయ్‌ మీదుగా బర్మింగ్‌హామ్‌ చేరుకోవల్సింది. కానీ ఇరాన్‌తో అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలుకావడం... దుబాయ్‌ విమానాశ్రయంపై కూడా ఇరాన్‌ దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సంఘటన తర్వాత దుబాయ్‌ గగనతలం మూసివేయడంతో సింధు మూడు రోజులపాటు దుబాయ్‌లోనే చిక్కుకుపోయింది. ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. విమానాల రాకపోకలు పునరుద్ధరణ తర్వాత స్వదేశానికి చేరుకున్న సింధు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. 

ఫలితంగా ఆమె స్విస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకుంది. సింధు గైర్హాజరీలో భారత్‌ నుంచి మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా, మాళవిక బన్సోద్‌ బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గద్దె రుతి్వక శివాని–రోహన్‌ కపూర్, తనీషా క్రాస్టో–ధ్రువ్‌ కపిల జోడీలు పాల్గొంటున్నాయి.    

Advertisement
 
Advertisement
Advertisement