పాక్ క్రికెటర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. 24 ఏళ్ల‌కే రిటైర్మెంట్‌ | 24 Years Old Pakistan Cricketer Shahzaib Bhatti Announces Retirement After T20 World Cup 2026 Disaster, Read Story Inside | Sakshi
Sakshi News home page

పాక్ క్రికెటర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. 24 ఏళ్ల‌కే రిటైర్మెంట్‌

Mar 10 2026 11:17 AM | Updated on Mar 10 2026 11:41 AM

24-year-old Pakistan cricketer announces retirement after T20 World Cup 2026 disaster

పాకిస్తాన్ దేశ‌వాళీ క్రికెట‌ర్, సియాల్‌కోట్ స్టార్ ఆల్‌రౌండర్‌  షహజైబ్ భట్టి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాక్‌ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ 24 ఏళ్ల‌కే భట్టి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. దేశీయ క్రికెట్‌లో రాజకీయ జోక్యం, అవినీతి ఎక్కవైందని అతడు ఆరోపించాడు. అస్తవ్యస్తమైన వ్యవస్థ కారణంగా తాను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు షహజైబ్ వెల్లడించాడు.

"పాకిస్తాన్ క్రికెట్‌కు గుడ్‌బై. 24 ఏళ్ల వయసులోనే నేను క్రికెట్ నుంచి తప్పుకొంటున్నాను. గతేడాది క్వైడ్-ఎ-అజం ట్రోఫీ ఫైనల్లో నా జట్టును గెలిపించాను. కానీ ఆ తర్వాత వరుసగా 40 మ్యాచ్‌ల పాటు నన్ను ఆడించకుండా పక్కన పెట్టారు" అని భట్టి ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.

షహజైబ్ భట్టి పాక్ దేశవాళీ క్రికెట్‌లో టాలెంటెడ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. క్వైడ్-ఎ-అజం ట్రోఫీ (2024-25)ను సియాల్‌కోట్ సొంతం చేసుకోవడంలో  భట్టి కీలక పాత్ర పోషించాడు. పెషావర్ రీజియన్‌తో జరిగిన ఫైనల్‌లో భట్టీ అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 40, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 32 పరుగులు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 

2024 చివరలో తన రెండో ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లోనే 5 వికెట్ల హాల్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఇంతటి అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికి , గత 14 నెలలుగా అతనికి ఒక్క ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. దాదాపు 40 మ్యాచ్‌ల పాటు అతడిని వరుసగా బెంచ్‌కే పరిమితం చేయడం గమనార్హం.

ఈ క్రమంలోనే భట్టీ తన కెరీర్‌ను అర్థవంతంగా ముగించాడు. తనలాంటి ఎందరో ఆటగాళ్ల కెరీర్‌లు ఈ విషపూరిత రాజకీయాల వల్ల నాశనమవుతున్నాయని భట్టీ ఆరోపించాడు. కాగా ఆ దేశ మాజీ క్రికెటర్లు సైతం పాకిస్తాన్ క్రికెట్‌లో రాజకీయం జోక్యం ఎక్కవైందని గత కొన్నాళ్లగా విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు షహజైబ్ భట్టి తీసుకున్న ఈ నిర్ణయం పాక్ బోర్డులోని లోపాలను మరోసారి ఎత్తిచూపింది.
చదవండి: ఇండియా క్రికెట్‌‎ను నాశనం చేసింది: షోయబ్‌ అక్తర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement