
క్రికెట్‌లో జట్టు ప్రయోజనాల కోసం వ్యక్తిగత మైలురాళ్లను స్వచ్ఛందంగా త్యాగం చేసిన ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఈ కోవలో ముందు వరుసలో ఉంటాడు. డుప్లెసిస్ తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో సెంచరీ చేసే అవకాశం ఉన్నా జట్టు ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా తప్పుకొని నిస్వార్థ ఆటగాడనిపించుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. మేజర్ లీగ్ క్రికెట్‌లో డుప్లెసిస్ టెక్సస్ సూపర్ కింగ్స్‌ను నాయకత్వం వహిస్తాడు. ఈ సీజన్‌లో అతను 9 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 409 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 6) జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ జట్టు సూపర్ కింగ్స్ సియాటిల్ ఓర్కాస్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ 91 పరుగుల వద్ద రిటైర్డ్ ఔట్‌గా స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. సెంచరీ చేసే అవకాశం (ఇంకో ఓవర్ మిగిలి ఉంది) ఉన్నా జట్టు ప్రయోజనాల కోసం అతనీ నిర్ణయం తీసుకున్నాడు.
తాను తప్పుకుంటే ఆతర్వాత వచ్చే డొనొవన్ ఫెరియెరా ధాటిగా బ్యాటింగ్ చేసి జట్టు స్కోర్‌ను మరింత పెంచుతాడని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు డుప్లెసిస్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. వాస్తవానికి డుప్లెసిస్ ఈ త్యాగం చేయాల్సిన అవసరం లేదు.
అతడు కూడా భారీ హిట్టరే. అందులోనూ ఈ మ్యాచ్ అతని జట్టుకు పెద్దగా ఉపయోగపడేది కాదు. సూపర్ కింగ్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరింది. అయితే ఈ గెలుపుతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరింది. అది వేరే విషయం.
డుప్లెసిస్ నిస్వార్థంగా సెంచరీని త్యాగం చేయడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ ఉదంతంతో క్రికెట్ అభిమానులకు అతనిపై గౌరవం మరింత పెరిగింది. పొట్టి క్రికెట్ చరిత్రలో ఓ ఆటగాడు అవకాశం ఉండి కూడా స్వచ్ఛందంగా సెంచరీ చేసి అవకాశాన్ని వదులుకోవడం బహుశా ఇదే మొదటిసారి.
ఈ సీజన్‌లో (MLC) అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న డుప్లెసిస్ మరో సెంచరీ (మూడోది) చేసి చరిత్రపుటల్లో చిరస్థాయిగా తన పేరును లిఖించుకునే అవకాశాన్ని స్వచ్ఛందంగా వద్దనుకున్నాడు. ఫెరియెరా బ్యాటింగ్‌కు వస్తే తన జట్టు 200 పరుగుల మార్కును దాటుతుందని భావించి రిటైర్డ్ ఔట్‌గా క్రీజ్‌ను వదిలాడు.
తీరా చూస్తే ఆ ఫెరియెరా 3 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తూ.. డుప్లెసిస్ (52 బంతుల్లో 91; 6 ఫోర్లు, 4 ఫోర్లు), శుభమ్ రంజనే (41 బంతుల్లో 65 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
అనంతరం బరిలోకి దిగిన ఓర్కాస్.. ఆడమ్ మిల్నే (3.4-1-23-5) ఐదేయడంతో 18.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమితో ఓర్కాస్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసుకుంది.
ఇప్పటికే సూపర్ కింగ్స్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్లు ఆఫ్స్ బెర్తలను ఖారారు చేసుకోగా.. నాలుగో స్ధానం కోసం ఎంఐ న్యూయర్క్, ఓర్కాస్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ రెండు జట్లకు తలో 6 పాయింట్లు ఉన్నాయి.
ఓర్కాస్ తమ మొత్తం మ్యాచ్‌లను పూర్తి చేసుకోగా.. న్యూయార్క్‌కు మరో అవకాశం ఉంది. న్యూయార్క్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో (వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో పోరు) ఘోర ఓటమిపాలైతేనే ఓర్కాస్‌కు నాలుగో ప్లే ఆఫ్స్ బెర్తు దక్కే అవకాశం ఉంది. ఇది జరగడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.