చరిత్ర సృష్టించిన డెవాల్డ్‌ బ్రెవిస్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా.. | Dewald Brevis Becomes 1st Player In World To Achieve Multiple Records | Sakshi
Sakshi News home page

AUS vs SA: చరిత్ర సృష్టించిన బ్రెవిస్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు

Aug 12 2025 6:34 PM | Updated on Aug 12 2025 7:12 PM

Dewald Brevis Becomes 1st Player In World To Achieve Multiple Records

విధ్వంసకర బ్యాటింగ్‌తో ‘బేబీ ఏబీడీ’గా పేరొందిన డెవాల్డ్‌ బ్రెవిస్‌ (Dewald Brevis) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా (AUS vs SA T20I)తో రెండో టీ20 సందర్భంగా.. ఆసీస్‌ దిగ్గజం షేన్‌ వాట్సన్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో కంగారూ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

పరుగుల విధ్వంసం
కాగా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లింది సౌతాఫ్రికా టీమ్‌. ఇందులో భాగంగా తొలుత పొట్టి సిరీస్‌ మొదలుకాగా.. మొదటి టీ20లో ఆతిథ్య ఆసీస్‌ గెలిచింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మంగళవారం నాటి రెండో టీ20లో డెవాల్డ్‌ బ్రెవిస్‌ పరుగుల విధ్వంసం సృష్టించాడు.

కేవలం 41 బంతుల్లోనే శతకం సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 125 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో డెవాల్డ్‌ బ్రెవిస్‌ తన పేరిట పలు రికార్డులు లిఖించుకున్నాడు.

వాట్సన్‌ ప్రపంచ రికార్డు బద్దలు
ఆస్ట్రేలియా గడ్డ మీద అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాళ్లు
1. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (సౌతాఫ్రికా)- ఆస్ట్రేలియాపై 2025లో డార్విన్‌ వేదికగా 125 పరుగులు నాటౌట్‌
2. షేన్‌ వాట్సన్‌ (ఆస్ట్రేలియా)- టీమిండియాపై 2016లో సిడ్నీ వేదికగా 124 నాటౌట్‌
3. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (ఆస్ట్రేలియా)- వెస్టిండీస్‌పై 2024లో అడిలైడ్‌ వేదికగా 120 నాటౌట్‌.

తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డులు
🏏సౌతాఫ్రికా తరఫున పురుషుల అంతర్జాతీయ టీ20లలో అత్యంత పిన్న వయసులో శతకం బాదిన క్రికెటర్‌గా డెవాల్డ్‌ బ్రెవిస్‌. 22 ఏళ్ల 105 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు రిచర్డ్‌ లెవి (24 ఏళ్ల 36 రోజులు) పేరిట ఉండేది.

🏏ఆస్ట్రేలియాపై టీ20లలో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా డెవాల్డ్‌ బ్రెవిస్‌. 2018లో మార్టిన్‌ గఫ్టిల్‌ 49 బంతుల్లో సెంచరీ చేయగా..  బ్రెవిస్‌ 41 బంతుల్లోనే ఈ ఫీట్‌ అందుకున్నాడు.

🏏సౌతాఫ్రికా తరఫున పరుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా బ్రెవిస్‌ రికార్డు. గతంలో ఫాఫ్‌ డుప్లెసిస్‌ (119) వెస్టిండీస్‌పై 2015లో ఈ ఘనత సాధించాడు.

🏏మెన్స్‌ టీ20 క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన సౌతాఫ్రికా ప్లేయర్‌గా డెవాల్డ్‌ బ్రెవిస్‌. 2016లో ఫాఫ్‌ డుప్లెసిస్‌, 2023లో డొనావన్‌ ఫెరీరా ఐదేసి సిక్సర్లు బాదగా.. తాజాగా బ్రెవిస్‌ 8 సిక్సర్లు బాదడం విశేషం.

చదవండి: WC 2011: ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకోండి... వారిద్దరి సలహాల వల్లే..: యువీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement