
PC: BCCI/X
గెలిస్తే పొంగిపోవద్దు.. ఓటములకు కుంగిపోవద్దు.. గెలిచినపుడు ఆకాశానికి ఎత్తిన వాళ్లే.. కీలక సమయాల్లో ఓడిపోతే విమర్శలు, తిట్లతో ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం అధఃపాతాళానికి జారుకునేలా చేస్తారు. అయితే, అలాంటపుడే రెట్టించిన ఆత్మవిశ్వాసంతో గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తే.. సూపర్ కదా!
2011లో తాము కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నామని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) అన్నాడు. వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లో తాము చేసిన తప్పిదాల వల్ల విమర్శల పాలయ్యామని.. అయితే, సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), హెడ్‌కోచ్ గ్యారీ కిర్‌స్టన్ తమ స్ఫూర్తిదాయక మాటలతో ఆత్మవిశ్వాసం నింపారని తెలిపాడు.
ఈసారి ఎలాగైనా కప్ గెలవాలి
కాగా మహిళల ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI World Cup)కి ఈ ఏడాది శ్రీలంకతో కలిసి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 30- నవంబరు 2 వరకు జరిగే ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా కప్ గెలవాలనే పట్టుదలతో ఉంది.
మన మహిళల జట్టు ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అందుకోలేదు. 2005, 2017 వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో ఫైనల్ వరకు చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. అయితే, ఈసారి పాత తప్పిదాలు పునరావృతం చేయకుండా గెలిచి తీరతామని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. ఈ మెగా టోర్నీ ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం జరిగిన ఈవెంట్లో యువరాజ్ సింగ్ కూడా పాల్గొన్నాడు.
అప్పుడు మాపై తీవ్ర వ్యతిరేకత
ఈ సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టులో ఆత్మవిశ్వాసం నింపేలా.. 2011 నాటి పరిస్థితుల గురించి యువీ పంచుకున్నాడు. ‘‘అప్పటికి ఏ క్రికెట్ జట్టు కూడా సొంతగడ్డపై ఐసీసీ ట్రోఫీని గెలవనే లేదు. అంతేకాదు 28 ఏళ్లుగా భారత్ మళ్లీ వరల్డ్‌కప్ దక్కించుకోలేదు.
కాబట్టి అప్పుడు మా పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ టై చేసుకున్నాం.. ఈ తర్వాత సౌతాఫ్రికాతో గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాం. అప్పుడు మాపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
టీవీ చూడొద్దు.. హెడ్‌ఫోన్లు ఆన్‌లో పెట్టుకోండి
ఆ సమయంలో సచిన్ టెండుల్కర్, కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ‘మనం ఈ టోర్నమెంట్లో విజయం సాధించాలంటే ఈ పనులు తప్పక చేయాలి.. మొదటిది.. ఎవరూ కూడా టీవీ చూడొద్దు.
అంతేకాదు.. ఎవరూ వార్తా పత్రికలు చదవొద్దు. అంతేకాదు గ్రౌండ్‌కు వెళ్లే సమయంలో మీ హెడ్‌ఫోన్లు ఆన్‌లో పెట్టుకోండి. కేవలం ఆట మీద మాత్రమే దృష్టి సారించండి. ఆ తర్వాత మళ్లీ డ్రెసింగ్‌రూమ్‌కు వెళ్లే సమయంలో హెడ్‌ఫోన్స్ ఆన్ చేసుకోండి.
ధోని సేనదే ట్రోఫీ
బయటి నుంచి వచ్చే మాటలను మీరు పట్టించుకోవద్దు. అలాంటపుడే మనం అనుకున్న ఫలితాన్ని రాబట్టగలుగుతాం’ అని చెప్పారు’’ అని యువీ పేర్కొన్నాడు. ఇక దిగ్గజాల సూచనను పాటించిన ధోని సేన ఫైనల్‌కు చేరడమే కాదు.. శ్రీలంకను వాంఖడేలో ఓడించి నాటి వన్డే వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది కూడా!!.. నాటి ఈ టోర్నీలో యువీ ఆద్యంతం అద్భుతంగా ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు.