
త్వరలో జరుగనున్న ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ఈలోపే జట్టు ఇలా ఉండబోతుందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం మొదలైంది. పీటీఐ సోర్సస్ ప్రకారం.. టీమిండియాలో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. చాలా గ్యాప్ తర్వాత బుమ్రా పొట్టి ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనున్నాడు.
అతని డిప్యూటీ (వైస్ కెప్టెన్) విషయంలో మాత్రం బీసీసీఐ ముల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తుంది. అక్షర్‌ను కొనసాగించాలా లేదా శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పజెప్పాలా అన్న సందిగ్దంలో ఉన్నట్లు సమాచారం. ఓ పేసర్ బెర్త్ కోసం హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. రెండో వికెట్‌కీపర్‌గా జితేశ్ శర్మ, ధృవ్ జురెల్ పోటీ పడుతున్నారు.
టాప్-5గా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఎంపిక కావడం ఖరారైపోయింది. ఇదే జరిగితే గిల్ స్థానం ఎక్కడ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. టెస్ట్ జట్టుకు కెప్టెన్ అయిన గిల్‌ను జట్టులోకి తీసుకొని ఖాళీగా కూర్చోబెట్టే పరిస్థితి లేదు. అలాగని తప్పించనూ లేరు. గిల్‌ను తుది జట్టులోకి తప్పక తీసుకోవాలని భావిస్తే టాపార్డర్ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది.
భారత్ చివరిగా ఆడిన ఇంగ్లండ్ సిరీస్‌లో టాపార్డర్ విశేషంగా రాణించింది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓ హాఫ్ సెంచరీతో పాటు విధ్వంసకర శతకం బాదాడు. తిలక్ వర్మ, హార్దిక్ తలో హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించారు. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ తడబడినా మరో అవకాశం ఇవ్వక తప్పదు.
ఆల్‌రౌండర్ల కోటాలో శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తప్పక తుది జట్టులో ఉంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ కొనసాగుతారు. స్పెషలిస్ట్ పేసర్‌గా అర్షదీప్ స్థానం పక్కా. రింకూ సింగ్ స్థానమే ప్రశ్నార్థకంగా మారింది. గత సిరీస్‌లో అతను చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ చేయలేదు. పైగా జట్టులో ఆల్‌రౌండర్ల హవా కూడా పెరగడంతో రింకూ స్థానం గల్లంతయ్యే ప్రమాదం ఉంది.
ఆసియా కప్-2025 కోసం భారత జట్టు (పీటీఐ సోర్సస్ ప్రకారం)..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా/ప్రసిద్ద్ కృష్ణ, జితేశ్ శర్మ/ధృవ్ జురెల్