అరంగేట్రంలోనే ఆకట్టుకున్న భారత మహిళా జట్టు స్పిన్నర్ వైష్ణవి శర్మ తన ఆటతీరు పట్ల సంతృప్తిని వెలిబుచ్చింది. విశాఖ వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిని తొలి టీ20 మ్యాచ్‌లో 20 ఏళ్ల పంజాబీ స్పిన్నర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అదరగొట్టింది. పూర్తి కోటా (4 ఓవర్లు) బౌలింగ్ చేసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 16 పరుగులే ఇచి్చంది. వికెట్ తీయలేకపోయినప్పటికీ టి20లో ఇంత పొదుపుగా బౌలింగ్ చేయడం కూడా గొప్ప విషయం.
పైగా ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో ఆమె స్పెల్ (4–0–16–0) దోహదపడింది. మెయిడిన్ ఓవర్ లేకపోయినా... ఓవర్‌కు 4 పరుగుల ఎకానమీ రేట్ టి20ల్లో కచ్చితంగా ఉత్తమ ప్రదర్శనే అవుతుంది. ఇంత బాగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ దక్కకపోవడం ఏమాత్రం నిరాశ కలిగించలేదని వైష్ణవి పేర్కొంది.
జట్టు సహచరులు, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అంతా సానుకూల దృక్పథాన్ని అలవర్చిందని చెప్పుకొచ్చింది. మంగళవారం ఇదే వేదికపై భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య రెండో టి20 జరుగనుంది. సిరీస్‌లో ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 1–0తో ఆధిక్యంలో ఉంది.
హర్మన్ ప్రోత్సహించింది!
"నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. వికెట్ తీయలేదన్న నిరాశ ఏ మూలన కూడా లేదు. నిజం చెబుతున్నా నేననుకున్న విధంగా నా ప్రణాళికల్ని అమలు చేయగలిగాను. ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించాను. ఒక్క మ్యాచ్‌తోనే అయిపోలేదుగా... ఇంకా నాలుగు మ్యాచ్‌లున్నాయి.
మ్యాచ్ మొదలయ్యేందుకు ముందు కాస్త భయపడిన మాట వాస్తవమే! కానీ జాతీయ గీతం ఆలాపించాకా ఆ బెరుకు, భయం తొలగింది. మనసు నిర్మలమైంది. అందువల్లేనేమో నా పని నేను సానుకూల దృక్పథంతో చేసుకోగలిగాను. కెపె్టన్ హర్మన్‌ప్రీత్, జట్టు మేనేజ్‌మెంట్ నన్నెంతగానో ప్రోత్సహించారు" అని వైష్ణవి శర్మ వివరించింది.
చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్లు..?


