భారత టెన్నిస్ దిగ్గజానికి దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం
క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు ‘పద్మశ్రీ’
న్యూఢిల్లీ: తన ఆటతీరుతో అంతర్జాతీయస్థాయిలో భారత టెన్నిస్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన విజయ్ అమృత్‌రాజ్‌ను కేంద్ర ప్రభుత్వం సముచితరీతిలో గౌరవించింది. 2026 సంవత్సరానికి ప్రకటించిన కేంద్ర పౌర పురస్కారాల్లో విజయ్ అమృత్‌రాజ్‌కు మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ భూషణ్’ లభించింది. ఈసారి క్రీడా విభాగంలో మొత్తం తొమ్మిది మంది ‘పద్మ’ అవార్డులకు ఎంపికయ్యారు.
క్రికెటర్లు రోహిత్ శర్మ (మహారాష్ట్ర), హర్మన్‌ప్రీత్ కౌర్ భుల్లర్ (పంజాబ్)... పారాథ్లెట్ ప్రవీణ్ కుమార్ (ఉత్తరప్రదేశ్), భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్ సవితా పూనియా (హరియాణా), హాకీ కోచ్ బల్‌దేవ్ సింగ్ (పంజాబ్), యుద్ధకళల్లో వెటరన్ కోచ్‌లు భగవాన్‌దాస్ రైక్వార్ (మధ్యప్రదేశ్), పజానివెల్ (పుదుచ్చేరి), జార్జియాకు చెందిన రెజ్లింగ్ కోచ్, దివంగత వ్లాదిమిర్ మెస్త్‌విరిష్విలిలకు ‘పద్మశ్రీ’ అవార్డులు లభించాయి.
ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు గెలిచిన భారత రెజ్లర్లు యోగేశ్వర్ దత్, బజరంగ్ పూనియాలకు వ్లాదిమిర్ శిక్షణ ఇచ్చారు. 35 ఏళ్ల సవితా పూనియా భారత హాకీ జట్టుకు 308 మ్యాచ్‌ల్లో గోల్‌కీపర్‌గా వ్యవహరించింది. టోక్యో, రియో ఒలింపిక్స్‌లో పోటీపడింది. మూడుసార్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఉత్తమ గోల్‌కీపర్‌గా ఎంపికైంది.
పారాథ్లెటిక్స్‌లో హైజంప్ ఈవెంట్‌లో ఆడే 22 ఏళ్ల ప్రవీణ్ రెండు ఒలింపిక్ పతకాలు సాధించాడు. టి64 కేటగిరీలో పోటీపడే ప్రవీణ్ 2024 పారిస్ పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం, 2020 టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు. గత ఏడాది ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెల్చుకున్నాడు. 2022 ఆసియా పారా క్రీడల్లో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు.
తమిళనాడుకు చెందిన 72 ఏళ్ల విజయ్ అమృత్‌రాజ్ అమెరికాలోని కాలిఫోరి్నయాలో స్థిరపడ్డారు. 1970 నుంచి 1993 వరకు ఆయన ప్రొఫెషనల్ కెరీర్ సాగింది. విజయ్ 15 సింగిల్స్ టైటిల్స్, 13 డబుల్స్ టైటిల్స్ సాధించారు. ఓవరాల్‌గా 405 మ్యాచ్‌ల్లో గెలిచారు. 312 మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. 1980లో కెరీర్ బెస్ట్ 18వ ర్యాంక్‌ను అందుకున్నారు. 13,30,503 డాలర్లు ప్రైజ్‌మనీ సంపాదించారు. టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆయన బరిలోకి దిగారు.
32 సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడిన విజయ్ వింబుల్డన్‌లో రెండుసార్లు (1973, 1981), యూఎస్ ఓపెన్‌లో రెండుసార్లు (1973, 1974) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 2024లో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు సంపాదించిన విజయ్... ప్రపంచ పురుషుల టీమ్ టెన్నిస్ టోర్నీ డేవిస్‌కప్‌లోనూ ఆకట్టుకున్నారు. డేవిస్‌కప్‌లో రెండుసార్లు (1974, 1987) భారత జట్టు రన్నరప్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించారు. 1983లో ‘పద్మశ్రీ’ పొందిన విజయ్‌కు 1974లో ‘అర్జున అవార్డు’ కూడా లభించింది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర టెన్నిస్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విజయ్ హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు.
తన నాయకత్వ పటిమతో రోహిత్ శర్మ భారత క్రికెట్ జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. రోహిత్ కెప్టెన్సీలోనే టీమిండియా 2024లో టి20 ప్రపంచకప్ టైటిల్... 2025లో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ సాధించింది. ఐపీఎల్‌లో రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది. 2024లో అంతర్జాతీయ టి20ల నుంచి, 2025లో టెస్టు క్రికెట్ నుంచి రిటైరైన రోహిత్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 38 ఏళ్ల రోహిత్ భారత్ తరఫున 67 టెస్టులు ఆడి 4301 పరుగులు... 282 వన్డేలు ఆడి 11,577 పరుగులు... 159 టి20లు ఆడి 4231 పరుగులు సాధించాడు.
గత 17 ఏళ్లుగా భారత మహిళల క్రికెట్ జట్టులో సభ్యురాలిగా ఉన్న హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో గత ఏడాది టీమిండియా వన్డే వరల్డ్‌కప్ టైటిల్ గెలిచింది. స్వదేశంలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించిన భారత్ తొలిసారి ఈ ఘనత సాధించింది. 36 ఏళ్ల హర్మన్ ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడి 200 పరుగులు... 161 వన్డేలు ఆడి 4409 పరుగులు, 187 టి20లు ఆడి 3784 పరుగులు చేసింది. మూడు ఫార్మాట్‌లలో కలిపి 8 సెంచరీలు, 38 అర్ధ సెంచరీలు సాధించిన హర్మన్ 75 వికెట్లు కూడా పడగొట్టింది.


