స్మృతి- ప్రతీకా (PC: BCCI Women)
ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టుకు భారత మహిళా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని పదిహేను మంది సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. కాగా గతేడాది మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 గెలిచిన భారత జట్టు.. ఆ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో వైట్‌బాల్ సిరీస్‌లలో విజయాలు సాధించింది.
ఆస్ట్రేలియా పర్యటన
ప్రస్తుతం జాతీయ జట్టులోని కీలక ప్లేయర్లంతా మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026తో బిజీగా ఉన్నారు. జనవరి 9న మొదలైన ఈ టీ20 లీగ్.. ఫిబ్రవరి 5న ఫైనల్‌తో ముగియనుంది. ఈ టోర్నీ తర్వాత భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటన (India Women Tour Of Australia)కు వెళ్లనుంది. ఫిబ్రవరి 15 నుంచి మర్చి 6 మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు.. ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది.
ప్రతీకా రావల్‌కూ చోటు
ఈ నేపథ్యంలో ఇప్పటికే టీ20, వన్డే జట్లను ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా టెస్టు జట్టును కూడా అనౌన్స్ చేసింది. ఈ జట్టులో ప్రతీకా రావల్‌కు కూడా చోటు దక్కడం విశేషం. కాగా వరల్డ్‌కప్ టోర్నీలో స్మృతి మంధానకు ఓపెనింగ్ జోడీగా రాణించిన ప్రతీకా.. అనూహ్య రీతిలో గాయపడి కీలక మ్యాచ్‌లకు దూరమైంది.
అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న ప్రతీకా త్వరలోనే జట్టుతో చేరే అవకాశం ఉన్నట్లు తాజాగా స్పష్టమైంది. ఇక మరో ఓపెనింగ్ బ్యాటర్ షఫాలీ వర్మకు కూడా టెస్టు జట్టులో సెలక్టర్లు స్థానం కల్పించారు.
ఆస్ట్రేలియా వుమెన్‌తో ఏకైక టెస్టుకు భారత మహిళా జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అమన్‌జోత్ కౌర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహ్ శర్మ, క్రాంతి గౌడ్, వైష్ణవి శర్మ, సయాలి సత్‌గరే.
చదవండి: ప్రత్యేకంగా ఏమీ తినలేదు.. ఆ ప్రశ్నకు జవాబు దొరికింది: ఇషాన్ కిషన్


