న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు సంజూ శాంసన్ (6), అభిషేక్ శర్మ (0) విఫలమైన వేళ ఈ వన్‌డౌన్ బ్యాటర్ జట్టును ఆదుకున్నాడు.
ఇషాన్ ధనాధన్
కేవలం 21 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్.. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని ఏకంగా 76 పరుగులు సాధించాడు. ఇందులో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.
సూర్య, దూబే మెరుపులు
ఇక ఇషాన్‌తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత అజేయ అర్ధ శతకం (37 బంతుల్లో 82)తో రాణించగా.. శివం దూబే (18 బంతుల్లో 36 నాటౌట్) కూడా అదరగొట్టాడు. ఫలితంగా రాయ్‌పూర్ వేదికగా కేవలం మూడు వికెట్లు నష్టపోయి టీమిండియా 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
నేను ప్రత్యేకంగా ఏమీ తినలేదు
ఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సూర్య భాయ్ అనుకున్నట్లు మధ్యాహ్న భోజనంలో నేను ప్రత్యేకంగా ఏమీ తినలేదు. సాధారణ భోజనమే తిన్నాను. ఏదేమైనా ఈరోజు మ్యాచ్‌లో మెరుగ్గా ఆడాలనే సంకల్పంతోనే మైదానంలో అడుగుపెట్టాను.
ఒక్కోసారి మనం బాగానే బ్యాటింగ్ చేస్తున్నాం అనుకుంటాం. అలాంటపుడు బంతిని చూస్తూ.. మనకు అనువైన, మంచి షాట్లు మాత్రమే ఆడాలి. నేను ఈరోజు అదే పని చేశాను. రిస్క్ తీసుకోకుండానే పవర్‌ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని గట్టిగా అనుకున్నాను.
పవర్‌ప్లే అత్యంత ముఖ్యం
ముఖ్యంగా టీ20లలో 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పవర్‌ప్లే అత్యంత ముఖ్యమైనదిగా మారుతుంది. పవర్‌ప్లేలో.. మధ్య ఓవర్లలో నేను బాగా ఆడాను. నాకు నేనే వెన్నుతట్టుకున్నా. మంచి షాట్లు ఆడి జట్టును గెలిపించాలని భావించాను.
దేశవాళీ క్రికెట్‌లో నేను విరివిగా పరుగులు రాబట్టాను. తద్వారా టీమిండియాకు ఆడగల సత్తా నాలో ఇంకా మిగిలే ఉందని నాకు నేనే సమాధానం చెప్పుకోగలిగాను. జార్ఖండ్ తరఫున కెప్టెన్‌గా టీ20 టోర్నీ ట్రోఫీ కూడా గెలిచాను. పునరాగమనంలో నేను ఇది చేయగలనా? అని సందేహం వచ్చింది.
సరైన సమాధానం దొరికింది
అయితే, ఇప్పుడు ఈ ప్రశ్నకు నాకు సరైన సమాధానం దొరికింది. మంచి షాట్లు ఆడితే అనుకున్న ఫలితం రాబట్టగలము. ఈ క్రమంలో ఒకవేళ నేను అవుట్ అయినా చింతించాల్సిన అవసరం ఉండదు’’ అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
కాగా క్రమశిక్షణా రాహిత్యంతో దాదాపుగా మూడేళ్లుగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు మళ్లీ పిలుపునిచ్చిన సెలక్టర్లు.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు ఏకంగా ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేశారు.
ఆధిక్యంలో టీమిండియా
అయితే, పునరాగమనంలో అంటే కివీస్‌తో తొలి టీ20లో మాత్రం ఇషాన్ (5 బంతుల్లో 8) విఫలమయ్యాడు. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో చితక్కొట్టి తన విలువను చాటుకున్నాడు. ఇక తొలి టీ20లోనూ గెలిచిన టీమిండియా.. కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యం సంపాదించింది.
చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్
𝟓𝟎 𝐢𝐧 𝐚 𝐟𝐥𝐚𝐬𝐡 ⚡#IshanKishan slams the fastest T20I half-century in just 21 balls for India v NZ. 😮💨#INDvNZ, 2nd T20I | LIVE NOW 👉 https://t.co/Be1n2FWbLQ pic.twitter.com/UbpqrgpcTm
— Star Sports (@StarSportsIndia) January 23, 2026


