భారత మహిళల క్రికెట్ జట్టులోకి మరో యువ సంచలనం అడుగుపెట్టింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యంగ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ.. టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. అందుకు వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంటర్ననేషనల్ స్టేడియం వేదికైంది.
ఆదివారం శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20లో వైష్ణవి డెబ్యూ చేసింది. భారత కెప్టెన్ చేతుల హర్మన్‌ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ఆమె డెబ్యూ క్యాప్‌ను అందుకుంది. అరంగేట్రంలో వైష్ణవి శర్మ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ సాధించినప్పటికి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థిని కట్టడి చేసింది. లెఫ్ట్-ఆర్మ్ స్లో ఆర్థోడాక్స్ స్పిన్‌తో లంక బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టింది. ఈ క్రమంలో వైష్ణవి శర్మ గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు.
ఎవరీ వైష్ణవి శర్మ..?
20 ఏళ్ల వైష్ణవి శర్మ.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించింది. వైష్ణవి ఈ స్ధాయికి చేరుకోవడంలో తన తండ్రి నరేంద్ర శర్మది కీలక పాత్ర. నరేంద్ర శర్మగ్వాలియర్‌లోని జివాజీ విశ్వవిద్యాలయంలో అస్ట్రాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వైష్ణవిని చిన్నతనం నుంచే క్రికెటర్ చేయాలని ఆయన కలలు కనేవాడు. వైష్ణవి జాతకం చూసి క్రికెట్‌లో గొప్ప స్థాయికి ఆమె చేరుకుంటుందని ఆయన చిన్నప్పుడే ఊహించారు.
"నువ్వు డాక్టర్ అయితే జిల్లా లేదా ఈ నగరానికే పరిమితమవుతావు. అదే నువ్వు క్రీడల్లో విజయం సాధిస్తే ప్రపంచమే నిన్ను గుర్తిస్తందని "నరేంద్ర శర్మ తన కుమార్తెకు ఎప్పుడూ చెబుతూనే ఉండేవాడు. తన తండ్రి ఆశయం దిశగా ఆమె కూడా అడుగులు వేసింది.
ఇప్పుడు తన తండ్రి మాటలను వైష్ణవి నిజం చేసింది. వైష్ణవి 2021లో మధ్యప్రదేశ్ అండర్-19 జట్టు తరపున ప్రొఫిషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత దేశవాళీ టోర్నీల్లో కూడా మెరుగ్గా రాణించింది. ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో వైష్ణవి దుమ్ములేపింది.
మలేషియాపై కేవలం 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి ఆమె చరిత్ర సృష్టించింది.ఇందులో ఒక అద్భుతమైన హ్యాట్రిక్ కూడా ఉంది. అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో హ్యాట్రిక్ తీసిన తొలి భారత్ స్పిన్నర్‌గా ఆమె నిలిచింది. మొత్తం టోర్నమెంట్‌లో 17 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా ఆమె నిలిచింది.
2025 డొమెస్టిక్ సీజన్‌లో 21 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా వైష్ణవి నిలిచింది. ఈ సంచలన ప్రదర్శనల కారణంగానే ఆమె జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడింది. కాగా ఆమె అద్భుతమైన ప్రతిభకు గుర్తింపుగా బీసీసీఐ ఆమెను 'జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ' (ఉత్తమ జూనియర్ మహిళా క్రికెటర్)తో సత్కరించింది. అయితే డబ్ల్యూపీఎల్-2026 వేలంలో మాత్రం వైష్ణవి అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది. రూ.20 లక్షల బెస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన ఆమెను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపలేదు.


