ఐసీసీ వన్డే ప్రపంచకప్-2025లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత తమ తొలి సిరీస్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. సొంతగడ్డపై శ్రీలంకతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హ్యాట్రిక్ విజయాలు సాధించి.. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ ట్రోఫీని గెలిచింది.
తిరువనంతపురం వేదికగా శుక్రవారం రాత్రి నాటి మ్యాచ్‌లో శ్రీలంక మహిళా జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన హర్మన్ సేన.. విజయాల పరంపరను కొనసాగించింది. గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హర్మన్ నమ్మకాన్ని నిలబెట్టే రీతిలో భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
112 పరుగులకే పరిమితం
నిర్ణీత 20 ఓవర్లలో లంకను కేవలం 112 పరుగులకే పరిమితం చేశారు. రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ హాసిని పెరీరా (18 బంతుల్లో 25), ఇమేషా దులాని (32 బంతుల్లో 27), కవిశా దిల్హారి (13 బంతుల్లో 20), వికెట్ కీపర్ బ్యాటర్ కౌశాని నుతయంగన (16 బంతుల్లో 19 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.
ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. లంక బౌలర్ కవిశా దిల్హారి బౌలింగ్‌లో స్మృతి మంధాన (1) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగింది. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (9)ను కవిశా వెనక్కి పంపింది.
షఫాలీ, హర్మన్ ధనాధన్
ఇలాంటి దశలో మరో ఓపెనర్ షఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. షఫాలీ 42 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది 79 పరుగులు చేయగా.. హర్మన్ (18 బంతుల్లో 21) షఫాలీతో కలిసి అజేయంగా నిలిచింది. 13.2వ ఓవర్లో ఫోర్ బాది షఫాలీ జట్టును గెలుపు తీరాలు దాటించింది.
ఇక ఇంతకుముందు విశాఖపట్నంలో తొలి రెండు టీ20లలోనూ గెలిచిన భారత్ 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. భారత జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఇది 77వ విజయం. తద్వారా అంతర్జాతీయ మహిళల పొట్టి క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన సారథిగా హర్మన్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ మెగ్ లానింగ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి.. ఈ జాబితాలో తొలి స్థానానికి ఎగబాకింది.
మహిళల అంతర్జాతీయ టీ20లలో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు (సూపర్ ఓవర్ సహా)
👉హర్మన్‌ప్రీత్ కౌర్ (ఇండియా)- 130 మ్యాచ్‌లలో 77 విజయాలు
👉మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా)- 100 మ్యాచ్‌లలో 76 విజయాలు
👉హీదర్ నైట్ (ఇంగ్లండ్)- 96 మ్యాచ్‌లలో 72 విజయాలు
👉చార్లెట్ ఎడ్‌వర్డ్స్ (ఇంగ్లండ్)- 93 మ్యాచ్‌లలో 68 విజయాలు
👉ఎన్ చైవాయి (థాయ్‌లాండ్)- 79 మ్యాచ్‌లలో 55 విజయాలు.
చదవండి: Ro-Ko: అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత?


