ప్రతి ఏడాది మాదిరే ఈసారీ దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ మొదలైంది. అయితే, ఈసారి భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల రాకతో ఈ సీజన్‌కు పండుగ కళ వచ్చింది. ఢిల్లీ తరఫున కోహ్లి.. ముంబైకి ఆడుతూ రోహిత్ బుధవారం నాటి తొలి మ్యాచ్‌లలో శతక్కొట్టారు.
రెండో రౌండ్‌లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో కోహ్లి మరోసారి అద్భుత ప్రదర్శన కనబరచగా.. రోహిత్ మాత్రం ఈసారి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రో-కో బీసీసీఐ ఆదేశాల మేరకు ఇలా దేశీ క్రికెట్ బరిలో దిగారు. వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి తాము సిద్ధంగా ఉన్నామని మరోసారి సంకేతాలు ఇచ్చారు.
రూ. వెయ్యి కోట్లకు పైగానే
ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజ బ్యాటర్లుగా పేరు తెచ్చుకున్న రోహిత్- కోహ్లి.. సంపాదన ఏ స్థాయిలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కోహ్లి నెట్‌వర్త్ రూ. వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు, ఐపీఎల్‌లో ఆడటం ద్వారా కూడా రో-కో భారీ స్థాయిలో వేతనం పొందుతున్నారు. మరి విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ దిగ్గజాలకు లభించే మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా?!..
విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో లిస్ట్-ఎ మ్యాచ్‌లలో భాగమయ్యే ఆటగాళ్లను వారు ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించి.. తదనుగుణంగా ఫీజును చెల్లిస్తారు. ఆ వివరాలు ఇవీ..
సీనియర్ కేటగిరీ (40కి పైగా లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు)
తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్‌కు రూ. 60 వేల చొప్పున ఫీజు
రిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్‌కు రూ. 30 వేల చొప్పున ఫీజు
మిడ్-లెవల్ కేటగిరీ (21 నుంచి 40 లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు)
తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్‌కు రూ. 50 వేల చొప్పున ఫీజు
రిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్‌కు రూ. 25 వేల చొప్పున ఫీజు
జూనియర్ కేటగిరీ (0- 20 లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు)
తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్‌కు రూ. 40 వేల చొప్పున ఫీజు
రిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్‌కు రూ. 20 వేల చొప్పున ఫీజు.
రోజువారీ అలవెన్సులు
రవాణా, భోజనం ఖర్చులు.. వసతి ఏర్పాటు
ప్రదర్శన ఆధారంగా బోనస్‌లు
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన ఆటగాడికి రూ. 10 వేల ప్రైజ్‌మనీ
ప్రైజ్‌మనీ
నాకౌట్ దశకు చేరిన, ఫైనల్ ఆడిన జట్లకు ప్రైజ్‌పూల్ ఆధారంగా నజరానా ఇస్తారు.
అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ వచ్చేది ఎంత?
ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లుగా రోహిత్- కోహ్లి ఒక్కో వన్డేకు రూ. 6 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు అందుకుంటారు. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో సీనియర్ కేటగిరీలో ఉన్నందుకు గానూ రూ. 60 వేలతో పాటు బోనస్, అలవెన్సులు కూడా దక్కుతాయి. ఫీజులో వ్యత్యాసం ఉన్నా.. ఆట ఒక్కటే.
ఈ దేశీ టోర్నీ ద్వారానే తమను తాము నిరూపించుకున్న రో- కో వంటి ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నత స్థాయికి చేరారు. ఏదేమైనా బీసీసీఐ నిబంధనల పుణ్యమా అని రోహిత్- కోహ్లిలను మరోసారి తమ సొంత దేశీ జట్ల తరఫున ఆడుతుంటే చూసే భాగ్యం అభిమానులకు దక్కింది.


