సౌతాఫ్రికాతో ఐదో టీ20లో గెలిచిన టీమిండియా ఈ ఏడాదిని విజయంతో ముగించింది. స్వదేశంలో సత్తా చాటి ప్రొటిస్ జట్టును 3-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆసాంతం బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలతో విమర్శలు మూటగట్టుకున్న టీమిండియా విజయంతోనే సమాధానమిచ్చింది.
అయితే, ఈ సిరీస్ మొత్తంలో బ్యాటర్‌గా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) విఫలమయ్యాడు. టీ20 సారథిగా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 14 నెలలుగా అతడి ఫామ్ ఆందోళనకరంగా మారింది. సౌతాఫ్రికాతో తాజా సిరీస్‌లో మొత్తం కలిపి కేవలం 34 పరుగులు (నాలుగు ఇన్నింగ్స్) మాత్రమే చేయడం గమనార్హం.
దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం
సౌతాఫ్రికాతో ఐదో టీ20లో విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తన ఫామ్‌పై స్పందించాడు. ‘‘ఈ సిరీస్‌లో ఎలా ఆడాలని అనుకున్నామో.. ఆది నుంచి అదే విధంగా ఆడి ఫలితాన్ని రాబట్టాము. మేమేమీ కొత్తగా ట్రై చేయలేదు. ప్రతి విభాగంలోనూ పటిష్టం కావాలని భావించాము. అందుకు తగ్గ ఫలితం మీ కళ్ల ముందే ఉంది.
దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు అది అద్భుతమైన ఫలితం ఇచ్చింది. బుమ్రా (Jasprit Bumrah)తో పవర్ ప్లేలో ఒక్క ఓవర్ మాత్రమే వేయించి.. డెత్ ఓవర్లలోనూ వాడాలని అనుకున్నాము. ఈ సిరీస్‌లో మేము ప్రయత్నించాలనుకున్న ప్రతి ఒక్కటి ప్రయత్నించి చూశాము.
అతడు ఎక్కడో తప్పిపోయాడు
అయితే, ‘సూర్య ది బ్యాటర్’ని మాత్రం మేము మిస్సయ్యాము. అతడు ఎక్కడో తప్పిపోయాడు. త్వరలోనే స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తాడు’’ అని సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్‌గా తన వైఫల్యాన్ని అంగీకరించాడు.
ఏదేమైనా జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానని.. కష్టాల్లో ఉన్న ఎవరో ఒక ఆటగాడు ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవడం గొప్ప విషయమని సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు. కాగా ఐదో టీ20లో సూర్య ఐదు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.
టెస్టులలో వైట్‌వాష్.. వైట్‌బాల్ సిరీస్‌లు కైవసం
కాగా స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. తాజాగా అహ్మదాబాద్‌లో శుక్రవారం నాటి ఐదో టీ20లో గెలిచి 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తదుపరి న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ అనంతరం.. భారత టీ20 జట్టు సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్-2026 టోర్నమెంట్ బరిలో దిగనుంది.
Team India seal it in style! 🇮🇳🏆
A 3–1 series win and their 8th straight bilateral T20I series triumph.#INDvSA 5th T20I Match Highlights 👉 https://t.co/Sp7QQIzWtp pic.twitter.com/MyM6LVIHTE— Star Sports (@StarSportsIndia) December 19, 2025
చదవండి: రోహిత్ శర్మ యూటర్న్!


