నాలుగో టి20లోనూ భారత మహిళలదే గెలుపు
పోరాడి ఓడిన శ్రీలంక
స్మృతి, షఫాలీ, రిచా మెరుపులు
రేపు ఆఖరి టి20
తిరువనంతపురం: బౌలింగ్ ప్రతాపం... ‘హ్యాట్రిక్’ విజయాలతో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు... తాజాగా బ్యాటింగ్ విధ్వంసంతో ఆధిక్యాన్ని 4–0కు పెంచుకుంది. ఆదివారం జరిగిన నాలుగో టి20లో హర్మన్‌ప్రీత్ బృందం 30 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (48 బంతుల్లో 80; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), షఫాలీ వర్మ (46 బంతుల్లో 79; 12 ఫోర్లు, 1 సిక్స్)లతో పాటు ఆఖర్లో రిచా ఘోష్ (16 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి పోరాడి ఓడింది.
భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. జెమీమా రోడ్రిగ్స్ అస్వస్థత కారణంగా హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్ స్థానంలో అరుంధతి రెడ్డి తుది జట్టుకు ఆడారు. మంగళవారం ఇదే వేదికపై ఆఖరి పోరు జరుగుతుంది.
సెంచరీ భాగస్వామ్యం
ఈ సిరీస్‌లో ఆశించిన దూకుడు కనబర్చలేకపోయిన స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో తన శైలీ ఆటతీరుతో అలరించింది. ఓ వైపు షఫాలీ, మరోవైపు మంధాన లంక బౌలర్ల భరతం పట్టారు. దీంతో పవర్‌ప్లేలో 61/0 స్కోరు చేసింది. దూకుడు అంతకంతకూ పెరగడంతో 10.5 ఓవర్లలోనే భారత్ స్కోరు 100కు చేరింది. షఫాలీ 30 బంతుల్లో, మంధాన 35 బంతుల్లో అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి ధనాధన్ కొనసాగడంతో 14.2 ఓవర్లలోనే భారత్ 150 మార్క్ దాటింది.
ఈ క్రమంలో 2019లో వెస్టిండీస్‌పై చేసిన 143 పరుగుల భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకున్నారు. తర్వాత 162 స్కోరు వద్ద షఫాలీ, 6 పరుగుల వ్యవధిలో స్మృతి అవుటయ్యారు. తర్వాత వచ్చిన రిచా ఘోష్ భారీ సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడింది. రిచా, హర్మన్‌ప్రీత్ (16 నాటౌట్) అబేధ్యమైన మూడో వికెట్‌కు 23 బంతుల్లోనే 53 పరుగులు జోడించారు. రిచా మెరుపుల వల్లే భారత్ టి20 ఫార్మాట్‌లో తమ అత్యధిక స్కోరు (221/2) నమోదు చేసింది.
ఈసారి పోరాడి...
గత మూడు మ్యాచ్‌లతో పోలిస్తే లంక బ్యాటింగ్ తీరు పూర్తిగా మారింది. పెద్ద లక్ష్యం ముందు మోకరిల్లుతుందనుకుంటే ఆఖరి దాకా పోరాడి ఓడింది. కెపె్టన్ చమరి ఆటపట్టు (37 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హాసిని (33; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించారు. తర్వాత ఇమిషా దులాని (29; 3 ఫోర్లు), హర్షిత (20; 1 ఫోర్, 1 సిక్స్), నీలాక్షిక (11 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు) భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో లంక ఓటమి అంతరాన్ని తగ్గించింది.
స్కోరు వివరాలు
భారత ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) దులానీ (బి) శెహని 80; షఫాలీ (సి అండ్ బి) నిమషా 79; రిచా ఘోష్ (నాటౌట్) 40; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–162, 2–168. బౌలింగ్: మల్షా శెహని 4–0–32–1, కావ్య 4–0–43–0, కవిషా 4–0–47–0, రష్మిక 2–0–25–0, చమరి 2–0–30–0, నిమష 4–0–40–1.
శ్రీలంక ఇన్నింగ్స్: హాసిని (సి) హర్మన్ (బి) అరుంధతి 33; చమరి (సి) స్మృతి (బి) వైష్ణవి 52; ఇమిషా (రనౌట్) 29; హర్షిత (స్టంప్డ్) రిచా (బి) వైష్ణవి 20; కవిషా (సి) సబ్–కమలిని (బి) అరుంధతి 13; నీలాక్షిక (నాటౌట్) 23; రష్మిక (బి) శ్రీచరణి 5; కౌశిని (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–59, 2–116, 3–140, 4–147, 5–170, 6–185. బౌలింగ్: రేణుక 3–0–32–0, అరుంధతి 4–0–42–2, దీప్తి 4–0–31–0, వైష్ణవి 4–0–24–2, అమన్‌జోత్ 1–0–10–0, శ్రీచరణి 4–0–46–1.
1 శ్రీలంక తరఫున 150 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా చమరి ఆటపట్టు నిలిచింది. నీలాక్షిక సిల్వా (107), ఉదేíÙక ప్రబోధిని (106) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా మహిళల క్రికెట్‌లో 150 టి20లు ఎనిమిదో ప్లేయర్‌గా చమరి గుర్తింపు పొందింది.
80 మహిళల అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా స్మృతి గుర్తింపు పొందింది. 78 సిక్స్‌లతో హర్మన్‌ప్రీత్ పేరిట ఉన్న రికార్డును స్మృతి సవరించింది.
1703 ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో స్మృతి చేసిన పరుగులు. ఒకే ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును స్మృతి (2024లో 1659 పరుగులు) బద్దలు కొట్టింది.
4 తొలి వికెట్‌కు స్మృతి, షఫాలీ 100 కంటే ఎక్కువ పరుగులు జత చేయడం ఇది నాలుగోసారి.
221 టి20ల్లో భారత జట్టు తమ అత్యధిక స్కోరు సాధించింది. గత ఏడాది వెస్టిండీస్‌పై సాధించిన 217/4 స్కోరును భారత్ అధిగమించింది. టి20ల్లో భారత్ 200 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది నాలుగోసారి.
162 ఓపెనర్లు స్మృతి, షఫాలీ తొలి వికెట్‌కు జోడించిన పరుగులు. టి20ల్లో ఏ వికెట్‌కైనా భారత్‌కిదే అతిపెద్ద భాగస్వామ్యం.
4 మహిళా క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగుల క్లబ్‌లో చేరిన నాలుగో బ్యాటర్ స్మృతి. ఈమె కంటే ముందు మిథాలీ, సుజీ బేట్స్ (న్యూజిలాండ్), చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) ఈ ఘనత సాధించారు.


