మెల్‌బోర్న్: సొంతగడ్డపై జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్‌కు అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తున్నా... ఆర్థికంగా మాత్రం క్రికెట్ ఆ్రస్టేలియాకు నష్టాలు తప్పేలా లేవు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టుల్లో మూడింట గెలిచిన ఆతిథ్య ఆసీస్ సిరీస్ నిలబెట్టుకుంది. అయితే వీటిలో రెండు టెస్టు మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగిశాయి.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు రోజుల్లోనే ఫలితం రాగా... మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన నాలుగోదైన ‘బాక్సింగ్ డే’ టెస్టు మ్యాచ్ కూడా రెండు రోజుల్లోనే ముగిసింది. చివరి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు శుక్రవారం తొలి రోజు రికార్డు స్థాయిలో 94,199 మంది అభిమానులు మైదానానికి తరలిరాగా... శనివారం రెండో రోజు 92,045 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.
మూడో రోజు కోసం కూడా 90 వేల మందికి పైగా టికెట్లు కొనుగోలు చేసుకున్నారు. అయితే పిచ్ పేసర్లకు ఇతోధిక సాయం చేయడంతో ఈ మ్యాచ్‌లో తొలి రోజే 20 వికెట్లు నేలకూలాయి. ఇక రెండో రోజు 16 వికెట్లు పడగా... ఆరు సెషన్‌లలోపే ఫలితం తేలింది. దీంతో మూడో రోజు టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. ఇలా సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగియడంతో క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ)కు 10 మిలియన్ ఆ్రస్టేలియా డాలర్లు (రూ. 60.22 కోట్లు) నష్టం వాటిల్లినట్లు సమాచారం.
ఎంసీజీ పిచ్‌పై దుమారం
‘బాక్సింగ్ డే’ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో క్రీడాభిమానులతో పాటు విశ్లేషకులు, మాజీ ప్లేయర్లు సైతం అసహనం వ్యక్తం చేస్తునున్నారు. ఆస్ట్రేలియాలో కాకుండా మరెక్కడైనా ఇలా రెండు మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగిసిఉంటే పెద్దఎత్తున చర్చ జరిగేదని ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ నిప్పు రాజేయగా... దీనిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఎంసీజీ పిచ్‌పై 10 మిల్లీ మీటర్ల కన్నా ఎక్కువ పచ్చికను సిద్ధం చేశారని... ఇలా అయితే ఆటలో సమతుల్యత దెబ్బతింటుందని పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయ పడుతున్నారు.
‘మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం అసంతృప్తినిచి్చంది. తొలి రోజు పిచ్ అనూహ్యంగా స్పందించి పేసర్లకు సాయం చేసింది. ఇందులో మా ప్రమేయం లేదు. మంచి స్పోర్టింగ్ వికెట్ తయారు చేయాలనుకున్నాం. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుకుంటాం’ అని ఎంసీజీ క్యూరేటర్ మాథ్యూ పేజ్ పేర్కొన్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచిన ఆసీస్ ఓపెనర్ హెడ్ మాట్లాడుతూ... ‘మ్యాచ్ అన్నాక ఎవరో ఒకరు విజయం సాధించడం ఖాయం. బంతికి, బ్యాట్‌కు మధ్య పోరాటాన్ని అభిమానులు ఆస్వాదిస్తారు. అడిలైడ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇది కనిపించింది. ఎంసీజీలో మాత్రం ఇలా జరగలేదు’ అని అన్నాడు.


