సాత్విక్ రెడ్డి–రాధిక జోడీకి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్
సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రెండు విభాగాల్లో తెలుగు క్రీడాకారులు టైటిల్స్ సాధించారు. మహిళల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తమిరి సూర్య చరిష్మా... మిక్స్‌డ్ డబుల్స్‌లో తెలంగాణ ప్లేయర్ కనపురం సాత్విక్ రెడ్డి విజేతలుగా నిలిచారు. 58 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ తుది పోరులో విజయవాడకు చెందిన 19 ఏళ్ల సూర్య చరిష్మా 17–21, 21–12, 21–14తో తన్వీ పత్రి (ఒడిశా)పై విజయం సాధించింది.
2013లో పీవీ సింధు తర్వాత జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో టైటిల్ గెలిచిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్‌గా సూర్య చరిష్మా గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన ఆమెకు రూ. 3 లక్షల 50 వేలు ప్రైజ్‌మనీగా లభించాయి. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సాత్విక్ రెడ్డి (తెలంగాణ)–రాధిక శర్మ (పంజాబ్) ద్వయం 21–9, 21–15తో అశిత్ సూర్య–అమృత (కర్ణాటక) జంటను ఓడించింది.
పురుషుల సింగిల్స్ ఫైనల్లో రిత్విక్ సంజీవి (తమిళనాడు) 21–16, 22–20తో భరత్ రాఘవ్ (హరియాణా)పై గెలుపొందాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో హరిహరన్–రూబన్ (తమిళనాడు) 21– 17, 21–12తో మిథిలేశ్–ప్రెజన్ (పుదుచ్చేరి)లపై ... మహిళల డబుల్స్ ఫైనల్లో శిఖా–అశి్వని (కర్ణాటక) 21–14, 21–18తో ప్రియాదేవి (మణిపూర్)–శ్రుతి (ఉత్తరప్రదేశ్)లపై గెలిచారు.


