సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తమిరి సూర్య చరిష్మా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సూర్య చరిష్మా 21–12, 21–9తో సాక్షి ఫొగాట్ (రాజస్తాన్)పై విజయం సాధించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ ఉన్నతి హుడా (హరియాణా)తో సూర్య చరిష్మా తలపడుతుంది.
ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉన్నతి 19–21, 21–14, 21–12తో మేఘన రెడ్డి (తెలంగాణ)పై శ్రమించి గెలిచింది. తన్వీ శర్మ (పంజాబ్), రక్షిత శ్రీ (తమిళనాడు), తన్వీ పత్రి (ఒడిశా), ఆకర్షి కశ్యప్ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), శ్రుతి (మహారాష్ట్ర), అనుపమ (ఢిల్లీ) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ ఎం.తరుణ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో తరుణ్ 21–15, 21–5తో అభినవ్ గార్గ్ (కర్ణాటక)పై గెలిచాడు.


