ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ
మెల్‌బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్) వరుసగా నాలుగో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2023, 2024లలో టైటిల్ సాధించిన ఆమె గత ఏడాది మాడిసన్ కీస్ (అమెరికా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో సబలెంకా 6–2, 6–3తో 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది.
76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా 29 విన్నర్స్ కొట్టి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. శనివారం జరిగే ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్)తో సబలెంకా తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో రిబాకినా 6–3, 7–6 (9/7)తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై విజయం సాధించింది.
1 గంట 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రిబాకినా ఆరు ఏస్‌లు సంధించింది. 31 విన్నర్స్ కొట్టిన ఆమె తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ఆ్రస్టేలియన్ ఓపెన్ ఫైనల్లో సబలెంకా, రిబాకినా తలపడనుండటం ఇది రెండోసారి. 2023 ఫైనల్లో రిబాకినాపైనే గెలిచి సబలెంకా తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించింది.
3 ఆ్రస్టేలియన్ ఓపెన్ చరిత్రలో వరుసగా నాలుగేళ్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఫైనల్ చేరిన మూడో క్రీడాకారిణి సబలెంకా. గతంలో ఇవోన్ గూలాగాంగ్ (ఆ్రస్టేలియా; 1971 నుంచి 1976 వరకు), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్; 1997 నుంచి 2002 వరకు) వరుసగా ఆరుసార్లు ఫైనల్ చేరారు.
నేడు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్
అల్‌కరాజ్ x జ్వెరెవ్ (ఉదయం 9 నుంచి)
జొకోవిచ్x సినెర్ (మధ్యాహ్నం 2 నుంచి)
సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం


