స్వియాటెక్‌ అవుట్‌ | Iga Swiatek suffers another disappointment at the Australian Open | Sakshi
Sakshi News home page

స్వియాటెక్‌ అవుట్‌

Jan 29 2026 4:09 AM | Updated on Jan 29 2026 4:09 AM

Iga Swiatek suffers another disappointment at the Australian Open

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మరోసారి నిరాశ 

‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ ఘనత కోసం తప్పని నిరీక్షణ

పోలాండ్‌ స్టార్‌పై వరుస సెట్‌లలో నెగ్గిన రిబాకినా

అనిసిమోవాపై గెలుపుతో సెమీస్‌లో పెగూలా  

మెల్‌బోర్న్‌: అందని ద్రాక్షగా ఉన్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను సాధించి ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ ఘనత సాధించాలని ఆశించిన పోలాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీగా జరిగే ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో ఎనిమిదోసారి బరిలోకి దిగిన స్వియాటెక్‌ ఈసారి క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని దాటలేకపోయింది. కజకిస్తాన్‌ స్టార్, ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ఎలెనా రిబాకినా 7–5, 6–1తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ స్వియాటెక్‌ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 

ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో రిబాకినా చేతిలో స్వియాటెక్‌ ఓడిపోవడం ఇది రెండోసారి. 2023లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రిబాకినా 6–4, 6–4తో స్వియాటెక్‌ను ఓడించింది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో స్వియాటెక్‌పై రెండుసార్లు నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా రిబాకినా నిలిచింది. స్వియాటెక్‌తో 95 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో రిబాకినా 11 ఏస్‌లు సంధించింది. మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తొలి సర్వీస్‌లో 29 పాయింట్లకు 23 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 30 పాయింట్లకు 17 పాయింట్లు సంపాదించింది. 

26 విన్నర్స్‌ కొట్టిన 2023 రన్నరప్‌... 19 అనవసర తప్పిదాలు చేసింది. నెట్‌ వద్దకు ఏడుసార్లు దూసుకొచ్చి ఆరుసార్లు పాయింట్లు గెలిచిన రిబాకినా తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, స్వియాటెక్‌ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. మరోవైపు స్వియాటెక్‌ 10 విన్నర్స్‌ కొట్టి, 25 అనవసర తప్పిదాలు చేసింది. 24 ఏళ్ల స్వియాటెక్‌ నాలుగుసార్లు (2020, 2022, 2023, 2024) ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను... ఒకసారి (2025) వింబుల్డన్‌ టైటిల్‌ను...ఒకసారి (2022) యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను సాధించింది. 

వచ్చే ఏడాది స్వియాటెక్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను సాధిస్తే... మరియా షరపోవా (2012లో) తర్వాత ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ పూర్తి చేసుకున్న రెండో క్రీడాకారిణిగా... ఓవరాల్‌గా 11వ క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది.  

అనిసిమోవా నిష్క్రమణ 
గత ఏడాది వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ నాలుగో ర్యాంకర్‌  అనిసిమోవా (అమెరికా) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మాత్రం అద్భుతం చేయలేకపోయింది. అమెరికాకే చెందిన ఆరో సీడ్‌ జెస్సికా పెగూలాతో జరిగిన మ్యాచ్‌లో అనిసిమోవా 2–6, 6–7 (1/7)తో ఓడిపోయింది. 

అనిసిమోవాపై గెలుపుతో పెగూలా తన కెరీర్‌లో తొలిసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో పెగూలా ఆరు ఏస్‌లు సంధించింది. మరోవైపు అనిసిమోవా ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. అనిసిమోవా 18 విన్నర్స్‌తో పోలిస్తే 20 విన్నర్స్‌ కొట్టిన పెగూలా 21 అనవసర తప్పిదాలు చేసింది. అనిసిమోవా 44 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. నాలుగుసార్లు అనిసిమోవా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన పెగూలా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది.

నేటి మహిళల సెమీఫైనల్స్‌
సబలెంకా x స్వితోలినా 
పెగూలా x రిబాకినా 
మధ్యాహ్నం 2 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

జొకోవిచ్‌ను గట్టెక్కించిన ముసెట్టి గాయం
పురుషుల సింగిల్స్‌ విభాగంలో 10 సార్లు చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా), డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో జొకోవిచ్‌కు ప్రత్యర్థి లొరెంజో ముసెట్టి (ఇటలీ) గాయం గట్టెక్కించగా... సినెర్‌ 6–3, 6–4, 6–4తో ఎనిమిదో సీడ్‌ బెన్‌ షెల్టన్‌ (అమెరికా)పై విజయం సాధించాడు. 

ముసెట్టితో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌ తొలి రెండు సెట్‌లను 4–6, 3–6తో కోల్పోయాడు. మూడో సెట్‌లో మాత్రం 3–1తో ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో ముసెట్టి కాలికి గాయం కావడంతో అతను వైదొలిగాడు. దాంతో ఓడిపోయే అవకాశాలున్న చోట జొకోవిచ్‌ అదృష్టవశాత్తూ విజయతీరానికి చేరాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో జ్వెరెవ్‌ (జర్మనీ)తో అల్‌కరాజ్‌; సినెర్‌తో జొకోవిచ్‌ తలపడతారు.  

1 ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో తొలి రెండు సెట్‌లు గెలిచి, ఆ తర్వాత గాయం కారణంగా వైదొలిగిన తొలి ప్లేయర్‌గా లొరెంజో ముసెట్టి నిలిచాడు.

5 ఓపెన్‌ శకంలో (1968 నుంచి) వరుసగా ఆరు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో సెమీఫైనల్‌కు చేరిన ఐదో ప్లేయర్‌గా సినెర్‌ గుర్తింపు పొందాడు. గతంలో ఇవాన్‌ లెండిల్, ఫెడరర్, జొకోవిచ్, నాదల్‌ ఈ ఘనత సాధించారు.

6 ఓపెన్‌ శకంలో (1968 నుంచి) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో వరుసగా నాలుగుసార్లు సెమీఫైనల్‌కు చేరిన ఆరో ప్లేయర్‌గా జొకోవిచ్‌ నిలిచాడు. గతంలో గిలెర్మో విలాస్, ఇవాన్‌ లెండిల్, స్టీఫెన్‌ ఎడ్బర్గ్, ఫెడరర్, ఆండీ ముర్రే ఈ ఘనత సాధించారు.

103 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా జొకోవిచ్‌ రికార్డు నెలకొల్పాడు. 102విజయాలతో ఫెడరర్‌ పేరిట ఉన్న రికార్డునుజొకోవిచ్‌ బద్దలు కొట్టాడు.

2 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌ చేరిన రెండో అతిపెద్ద వయసు్కడిగా జొకోవిచ్‌ (38 ఏళ్ల 241 రోజులు) గుర్తింపు పొందాడు. కెన్‌ రోజ్‌వాల్‌ (1977లో; 42 ఏళ్ల 60 రోజులు) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement