క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ స్టార్
జొకోవిచ్, జ్వెరెవ్ కూడా ముందంజ
మెల్‌బోర్న్: ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకోవాలనే లక్ష్యంతో ఆ్రస్టేలియన్ ఓపెన్ టోర్నీలో బరిలోకి దిగిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ అల్‌కరాజ్ ఆ దిశగా మరో అడుగు వేశాడు. వరుసగా నాలుగో మ్యాచ్‌లో మూడు సెట్‌లలో విజయాన్ని అందుకొని వరుసగా మూడో ఏడాది క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. 19వ సీడ్ టామీ పాల్ (అమెరికా)తో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అల్‌కరాజ్ 7–6 (8/6), 6–4, 7–5తో గెలుపొందాడు.
2 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ స్టార్ రెండు ఏస్‌లు సంధించి, 35 విన్నర్స్ కొట్టాడు. తన సర్వీ స్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)తో అల్‌కరాజ్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో డిమినార్ 6–4, 6–1, 6–1తో పదో సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)ను ఓడించాడు.
మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 6–4, 6–4తో సెరున్‌డోలో (అర్జెంటీనా)పై గెలుపొందగా... లెర్నర్ టియెన్ (అమెరికా) 6–4, 6–0, 6–3తో 11వ సీడ్ మెద్వెదెవ్ (రష్యా)ను బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో అమెరికా తరఫున ఆండీ రాడిక్ (2001లో యూఎస్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన పిన్న వయసు్కడిగా లెర్నర్ టియెన్ (20 ఏళ్లు) గుర్తింపు పొందాడు.
సబలెంకా జోరు
మహిళల సింగిల్స్ విభాగంలో రెండుసార్లు చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ బెలారస్ స్టార్ 6–1, 7–6 (7/1)తో విక్టోరియా ఎంబాకో (కెనడా)పై గెలిచింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఆరు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 31 విన్నర్స్ కొట్టిన ఆమె, 24 అనవసర తప్పిదాలు చేసింది.
మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 6–4తో ఎనిమిదో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా)ను బోల్తా కొట్టించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 3–6, 6–3తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై, ఇవా జోవిచ్ (అమెరికా) 6–0, 6–1తో పుతింత్‌సెవా (కజకిస్తాన్)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
జొకోవిచ్ 16వసారి....
రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కోర్టులో అడుగు పెట్టకుండానే క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జాకుబ్ మెన్‌సిఖ్ (చెక్ రిపబ్లిక్)తో నేడు జొకోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్ జరగాల్సింది. అయితే గాయం కారణంగా మెన్‌సిఖ్ ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు.
దాంతో జొకోవిచ్ ‘వాకోవర్’ లభించింది. ఫలితంగా ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 16వసారి ఈ సెర్బియా స్టార్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తద్వారా ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో అత్యధికసార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన ప్లేయర్‌గా రోజర్ ఫెడరర్ (15) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ బద్దలు కొట్టాడు.


