సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గాయం కారణంగా మిగిలిన సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ టోర్నీలో భాగంగా జనవరి 10న ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా డుప్లెసిస్ కుడి చేతి బొటనవేలికి తీవ్రమైన గాయమైంది.
దీంతో ఆ మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌కు రాలేదు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించి స్కాన్ నిర్వహించగా.. బొటనవేలి లిగమెంట్ తెగిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ క్రమంలో ఫాప్ త్వరలోనే తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు.
ఈ విషయంపై జేఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ఫాఫ్ కనీసం బ్యాట్ కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్నాడని, అందుకే టోర్నీ నుండి వైదొలిగాల్సి వచ్చిందని తెలిపాడు. 41 ఏళ్ల డుప్లెసిస్ ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడి 135 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 151.69 గా ఉంది.
డుప్లెసిస్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు జేఎస్‌కే సైతం ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడువ స్థానంలో ఉంది. మిగిలిన మ్యాచ్‌లకు జేమ్స్ విన్స్ జేఎస్‌కే సారథిగా వ్యవహరించే అవకాశముంది.
జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు ఇదే
జేమ్స్ విన్స్, మాథ్యూ డి విలియర్స్, వియాన్ ముల్డర్, మైఖేల్-కైల్ పెప్పర్ (కీపర్), డోనవన్ ఫెరీరా, ప్రెనెలన్ సుబ్రాయన్, డయాన్ ఫారెస్టర్, అకీల్ హోసేన్, నాండ్రే బర్గర్, డేనియల్ వోరల్, శుభమ్ రంజనే, రిచర్డ్ గ్లీసన్, జారెన్ బాచర్, నీల్ టిమ్మర్స్, జాంకో స్మిత్, స్టీవ్ స్టోల్క్, దువాన్ జాన్సెన్, రివాల్డో మూన్సామి.


